ICC Women's ODI World Cup 2025: వన్డే వరల్డ్ కప్: ఫైనల్ కు సౌతాఫ్రికా
ఫైనల్ కు సౌతాఫ్రికా
ICC Women's ODI World Cup 2025: ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న సౌతాఫ్రికా విమెన్స్ జట్టు తొలిసారి వన్డే వరల్డ్ కప్ ఫైనల్ చేరుకుంది. కెప్టెన్ లారా వోల్‌వార్ట్ (143 బాల్స్‌లో 20 ఫోర్లు, 4 సిక్స్‌లతో 169) భారీ సెంచరీకి తోడు మరిజేన్ కాప్ (5/20) బౌలింగ్‌లో రాణించడంతో బుధవారం జరిగిన తొలి సెమీస్‌లో సఫారీ జట్టు 125 రన్స్ తేడాతో ఇంగ్లండ్‌పై గెలిచింది. ఇదే గ్రౌండ్‌లో తమ ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 69 రన్స్‌కే ఆలౌటైన సఫారీ టీమ్ ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ట్రోఫీకి అడుగు దూరంలో నిలిచింది. టాస్ ఓడిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 319/7 స్కోరు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన వోల్‌వార్ట్ చివరి వరకు అద్భుతంగా ఆడి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పింది. తజ్మిన్ బ్రిట్స్ (45)తో తొలి వికెట్‌కు 116, మరిజేన్ కాప్ (42)తో నాలుగో వికెట్‌కు 72, చోలే ట్రయాన్ (33 నాటౌట్) ఏడో వికెట్‌కు 89 రన్స్ జోడించింది. అనెకా బోష్ (0), సునె లుస్ (1), సినాలో జాఫ్తా (1), డెరెక్‌సన్ (4) నిరాశపర్చారు. ఎకిల్‌స్టోన్ 4, లారెన్ బెల్ 2 వికెట్లు తీసింది.
తర్వాత ఛేజింగ్‌లో ఇంగ్లండ్ 42.3 ఓవర్లలో 194 రన్స్‌కే ఆలౌటైంది. కెప్టెన్ సివర్ బ్రంట్ (64), అలైస్ కాప్సీ (50) హాఫ్ సెంచరీలతో రాణించగా, డ్యానీ వ్యాట్ (34), లిన్సీ స్మిత్ (27) మోస్తరుగా ఆడారు. ఆరంభం నుంచే సఫారీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో అమీ జోన్స్ (0), ట్యామీ బ్యూమోంట్ (0), హీథర్ నైట్ (0) డకౌటయ్యారు. 1/3 వద్ద వచ్చిన బ్రంట్, కాప్సీ నాలుగో వికెట్‌కు 107 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను ఆదుకున్నారు. కానీ లోయర్ ఆర్డర్‌లో సరైన మద్దతు లభించకపోవడంతో భారీ ఛేజింగ్‌లో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. వోల్‌వార్ట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.