Saina Nehwal’s Key Announcement: భర్త నుంచి విడాకులు తీసుకుంటున్నా.. సైనా నెహ్వాల్ కీలక ప్రకటన

సైనా నెహ్వాల్ కీలక ప్రకటన;

Update: 2025-07-14 05:23 GMT

 Saina Nehwal’s Key Announcement: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, ఆమె భర్త పారుపల్లి కశ్యప్ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని సైనా నెహ్వాల్ స్వయంగా ఆదివారం (జూలై 13, 2025) తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు. వారు సుదీర్ఘంగా చర్చించిన తర్వాత పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సైనా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. "జీవితం కొన్నిసార్లు మనల్ని వేర్వేరు మార్గాల్లోకి తీసుకెళ్తుంది. చాలా ఆలోచించిన తర్వాత, కశ్యప్ పారుపల్లి, నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మేము మా కోసం, ఒకరికొకరు శాంతి, ఎదుగుదల, స్వస్థతను ఎంచుకుంటున్నాము. ఈ సమయంలో మా గోప్యతను అర్థం చేసుకుని గౌరవించినందుకు ధన్యవాదాలు" అని సైనా తన పోస్ట్‌లో రాశారు. సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ 2018 డిసెంబర్‌లో వివాహం చేసుకున్నారు. వారు సుమారు ఏడేళ్ల వివాహ బంధానికి, 20 ఏళ్ల స్నేహబంధానికి ఇప్పుడు ముగింపు పలికారు. సైనా నెహ్వాల్ ప్రస్తుతం మోకాలి నొప్పులు, ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నారు. ఈ కారణంగా ఆమెకు ప్రాక్టీస్ చేయడం కష్టంగా మారింది. ప్రస్తుతం ఆమె ర్యాంకింగ్స్ తగ్గాయి. ఆమె రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నట్లు కూడా గతంలో వెల్లడించారు, అయితే ప్రస్తుతానికి ఆటను కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా సైనా నెహ్వాల్ చిన్న వయసులోనే బ్యాడ్మింటన్ లో తన ప్రతిభను చాటుకుంది. ఆమె ఒలింపిక్ క్రీడలలో క్వార్టర్ ఫైనల్ చేరిన తొలి భారతీయ క్రీడాకారిణిగా, ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచారు. 2015లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకును కూడా సాధించారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకున్నారు. 2010 మరియు 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకాలు సాధించారు. ఆమె తన కెరీర్‌లో మొత్తం 24 అంతర్జాతీయ టైటిళ్లను గెలుచుకున్నారు, ఇందులో పది సూపర్ సిరీస్ టైటిళ్లు ఉన్నాయి.

Tags:    

Similar News