Asia Champions Trophy Final: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ రికార్డు విజయం.. జపాన్‌పై 4-1తో అద్భుత గెలుపు..
జపాన్‌పై 4-1తో అద్భుత గెలుపు..
Asia Champions Trophy Final: పురుషుల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. గురువారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా 4-1 గోల్స్ తేడాతో జపాన్‌ను మట్టికరిపించి చాంపియన్‌గా నిలిచింది. దీంతో రికార్డు స్థాయిలో ఆరోసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది.
ప్రారంభంలో జపాన్ షాక్.. భారత్ ఎదురుదాడి
మ్యాచ్ ప్రారంభమైన మూడో నిమిషంలోనే జపాన్ ప్లేయర్ కజుమస మట్సుమోటో అనూహ్య ఫీల్డ్ గోల్ చేసి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. తొలి క్వార్టర్ ముగిసే సమయానికి జపాన్ 1-0 ఆధిక్యంలో కొనసాగడంతో పాటు గట్టి డిఫెన్స్‌తో భారత అటాకింగ్‌ను అడ్డుకుంది. మొదటి అర్ధభాగం ముగిసేవరకు భారత ఆటగాళ్లు పలుమార్లు ప్రయత్నించినా గోల్ సాధించలేకపోయారు.
పుంజుకున్న భారత్.. మూడో క్వార్టర్‌లో సమవుజ్జీ
సెకండాఫ్‌లో దూకుడు పెంచిన భారత్, 42వ నిమిషంలో తొలి గోల్ సాధించింది. ఆదిత్య అందించిన రివర్స్ ఫ్లిక్ పాస్‌ను శిలానంద్ లాక్రా సమర్థంగా గోల్‌గా మలిచి స్కోరును 1-1తో సమం చేశాడు. ఈ గోల్‌తో టీమిండియాలో రెట్టింపు ఉత్సాహం వచ్చింది.
ఆఖరి క్వార్టర్‌లో గోల్స్ వర్షం
నాలుగో క్వార్టర్‌లో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది..
48వ నిమిషం:
దిల్‌ప్రీత్ సింగ్ అద్భుతమైన రివర్స్ షాట్‌తో గోల్ కొట్టి భారత్‌ను 2-1 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు.
53వ నిమిషం:
భారత్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను జుగ్‌రాజ్ సింగ్ శక్తిమంతమైన డ్రాగ్-ఫ్లిక్‌తో నెట్‌లోకి పంపి స్కోరును 3-1కి చేర్చాడు.
54వ నిమిషం:
వివేక్ సాగర్ ప్రసాద్ అదిరిపోయే హాఫ్-వాలీతో నాలుగో గోల్ బాది భారత్ విజయాన్ని లాంఛనప్రాయం చేశాడు.
ఆఖరి నిమిషాల్లో జపాన్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను భారత డిఫెన్స్ అడ్డుకోవడంతో భారత్ 4-1తో తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. అద్భుత పునరాగమనంతో కప్పు నెగ్గిన భారత హాకీ జట్టుపై క్రీడాభిమానులు, ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.