Women's T20 Asia Cup 2026: మహిళల టీ20 ఆసియా కప్‌ 2026లో భారత మహిళల క్రికెట్‌ జట్టు ఘనంగా బోణీ కొట్టింది. దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో థాయ్‌లాండ్‌తో జరిగిన గ్రూప్‌-ఏ మ్యాచ్‌లో భారత్‌ 94 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా.. లక్ష్యఛేదనలో థాయ్‌లాండ్‌ 16.1 ఓవర్లలో 65 పరుగులకే ఆలౌటైంది.

షఫాలీ వర్మ విధ్వంసం..

టాస్‌ గెలిచిన థాయ్‌లాండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. ముఖ్యంగా షఫాలీ వర్మ మరోసారి తనదైన దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంది. కేవలం 36 బంతుల్లోనే 64 పరుగులు చేసిన ఆమె ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఆమె స్ట్రైక్‌రేట్‌ 177.78గా నమోదైంది.

షఫాలీకి తోడు స్మృతి మంధాన 19 పరుగులు, అరంగేట్రం చేసిన ప్రతికా రావల్‌ 22 పరుగులు చేశారు. ఒక దశలో భారత్‌ భారీ స్కోరు దిశగా దూసుకెళ్లినప్పటికీ.. థాయ్‌లాండ్‌ స్పిన్నర్లు భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ను ఒక్కసారిగా కుదిపేశారు. భారత్‌ 8 వికెట్లను కేవలం 46 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. అయినప్పటికీ చివర్లో క్రాంతి గౌడ్‌ 8 బంతుల్లో 15 పరుగులు చేయడంతో భారత్‌ 159/9 వరకు చేరుకుంది.

భారత బౌలర్ల ముందు కుప్పకూలిన థాయ్‌లాండ్‌..

160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన థాయ్‌లాండ్‌కు భారత బౌలర్లు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ప్రారంభం నుంచే వికెట్లు పడుతూ రావడంతో థాయ్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఒత్తిడిలో పడిపోయింది.

నందనీ శర్మ 18 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయగా, దీప్తి శర్మ కూడా మూడు వికెట్లతో థాయ్‌లాండ్‌ పతనంలో కీలక పాత్ర పోషించింది. శ్రీ చరణి రెండు వికెట్లు పడగొట్టింది. చివరకు థాయ్‌లాండ్‌ 65 పరుగులకే ఆలౌటై 94 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.

దీప్తి శర్మ అరుదైన ఘనత..

ఈ మ్యాచ్‌ భారత విజయంతో పాటు దీప్తి శర్మ కెరీర్‌లోనూ ప్రత్యేకంగా నిలిచింది. కేవలం 7 బంతులు వేసి ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 3 వికెట్లు తీసిన దీప్తి.. మహిళల T20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించింది. ఆమె మొత్తం వికెట్ల సంఖ్య 171కి చేరి థాయ్‌లాండ్‌ బౌలర్‌ తిపచ్చా పుత్తావాంగ్‌ను అధిగమించి అగ్రస్థానానికి చేరుకుంది.

అంతేకాదు, ఈ మ్యాచ్‌ దీప్తి శర్మకు 150వ T20 అంతర్జాతీయ మ్యాచ్‌ కావడం మరో ప్రత్యేకత. ఈ ఘనత సాధించిన భారత మహిళా క్రికెటర్లలో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, స్మృతి మంధాన తర్వాత దీప్తి శర్మ మూడో క్రీడాకారిణిగా నిలిచింది.

జయంతో పాటు కొన్ని ఆందోళనలు కూడా..

భారత్‌ 94 పరుగుల భారీ తేడాతో విజయం సాధించినప్పటికీ.. బ్యాటింగ్‌లో మధ్య, లోయర్‌ ఆర్డర్‌ వైఫల్యం జట్టుకు ఆందోళన కలిగించే అంశంగా మారింది. షఫాలీ వర్మ ఇచ్చిన అద్భుతమైన ఆరంభాన్ని మిగతా బ్యాటర్లు పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయారు. రాబోయే బలమైన ప్రత్యర్థులతో జరిగే మ్యాచ్‌లకు ముందు ఈ లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది.

అయితే బౌలింగ్‌ విభాగం మాత్రం అద్భుతంగా రాణించడంతో భారత్‌ టోర్నీలో విజయంతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. షఫాలీ వర్మ బ్యాట్‌తో మెరుపులు మెరిపించగా.. దీప్తి శర్మ రికార్డు స్పెల్‌తో చరిత్ర సృష్టించింది. దీంతో ఆసియా కప్‌లో భారత జట్టు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగనుంది.

Tags: