Hong Kong Sixes: పాకిస్థాన్ చేతిలో భారత్‌కు ఘోర పరాజయం.. హాంకాంగ్ సిక్సెస్‌లో కంగుతిన్న టీమిండియా!
కంగుతిన్న టీమిండియా!
Hong Kong Sixes: హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నీలో భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన గ్రూప్-సి మ్యాచ్‌లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఆరు ఓవర్ల ఫార్మాట్లో జరిగిన ఈ పోరులో భారత బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. ముఖ్యంగా కెప్టెన్ క్రునాల్ పాండ్యా వేసిన ఒకే ఓవర్లో 31 పరుగులు సమర్పించుకోవడం జట్టు ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది.
టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఆరు ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో శశాంక్ సింగ్ అద్భుతంగా ఆడాడు. కేవలం 11 బంతుల్లోనే 40 పరుగులు సాధించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. అతని ఇన్నింగ్స్‌లో ఐదు సిక్సర్లు ఉన్నాయి.
అనంతరం 89 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ బ్యాటర్లు భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఖ్వాజా నఫే 12 బంతుల్లో 41 పరుగులు చేయగా, కెప్టెన్ అబ్బాస్ అఫ్రిది కేవలం ఎనిమిది బంతుల్లో 35 పరుగులు సాధించాడు. వీరిద్దరూ భారత బౌలింగ్‌ను చీల్చిచెండాడటంతో పాకిస్థాన్ కేవలం 3.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
భారత బౌలింగ్‌లో క్రునాల్ పాండ్యా ఒకే ఓవర్లో 31 పరుగులు ఇవ్వడం తీవ్ర చర్చకు దారితీసింది. మరో బౌలర్ నటరాజన్ కూడా తన ఓవర్లో 28 పరుగులు సమర్పించుకున్నాడు. శశాంక్ సింగ్, రాహుల్ తెవాటియా ఒక్కో వికెట్ తీసుకున్నప్పటికీ పాకిస్థాన్ పరుగుల వేగాన్ని అడ్డుకోలేకపోయారు.
ఈ ఓటమితో భారత్ గ్రూప్ దశలో తన అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది. అంతకుముందు పాకిస్థాన్ జట్టు యూఏఈ చేతిలో ఓడిపోయినప్పటికీ భారత్‌పై విజయం సాధించి తిరిగి పోటీలోకి వచ్చింది. ఇప్పుడు యూఏఈపై భారత్ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెట్ రన్‌రేట్ కూడా కీలకం కానుండటంతో తదుపరి మ్యాచ్‌పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.