India Wins Women's Kabaddi World Cup: విమెన్స్ కబడ్డీ వరల్డ్ కప్ నెగ్గిన ఇండియా వరుసగా రెండోసారి ట్రోఫీ కైవసం
ఇండియా వరుసగా రెండోసారి ట్రోఫీ కైవసం
India Wins Women's Kabaddi World Cup: ప్రతిష్టాత్మక విమెన్స్ కబడ్డీ వరల్డ్ కప్‌లో ఇండియా అమ్మాయిల జట్టు తన ఆధిపత్యాన్ని చాటుకుంది. వరుసగా రెండోసారి జగజ్జేతగా నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్లో ఇండియా 35–-28 తేడాతో చైనీస్ తైపీపై గెలిచి టైటిల్ నిలబెట్టుకుంది. ఈ టైటిల్ పోరు ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మ్యాచ్ ఆరంభం నుంచే ఇండియా ప్లేయర్లు దూకుడుగా ఆడారు. డిఫెన్స్, రైడింగ్‌లో సమష్టిగా రాణించి చైనీస్ తైపీ పని పట్టారు.
ఈ విజయంలో టీమిండియా కెప్టెన్ రీతూ నేగి, వైస్ కెప్టెన్ పుష్ప రాణా కీలక పాత్ర పోషించారు. ఇక, టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడిన సంజు దేవి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు అందుకుంది. 11 దేశాలు పోటీ పడ్డ ఈ వరల్డ్ కప్‌లో ఇండియా అజేయంగా నిలిచింది. లీగ్ దశలో అన్ని మ్యాచ్‌ల్లో గెలిచిన జట్టు సెమీఫైనల్లో 33–21తో బలమైన ఇరాన్ జట్టు చిత్తు చేసి ఫైనల్‌కు చేరింది. 2012లో జరిగిన తొలి వరల్డ్ కప్‌లో ఇండియా ట్రోఫీ నెగ్గింది. నాటి ఫైనల్లో ఇరాన్‌పై విజయం సాధించింది. పలుమార్లు వాయిదా పడుతూ ఇన్నేండ్ల విరామం తర్వాత జరిగిన తాజా టోర్నీలో గెలిచి కబడ్డీలో తాము తిరుగులేని శక్తి అని నిరూపించుకుంది.