Indian Premier League: ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఫ్రాంచైజీకి ఊహించని షాక్ తగిలినట్లు తెలుస్తోంది. జట్టు స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ, ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్‌తో విభేదాల కారణంగా జట్టును వీడేందుకు సిద్ధమవుతున్నట్లు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. కెప్టెన్సీ ఎంపిక విషయంలో చోటుచేసుకున్న పరిణామాలే ఇందుకు ప్రధాన కారణమని సమాచారం.

#అసంతృప్తికి అసలు కారణం ఏంటి?

పాట్ కమిన్స్ స్థానంలో ఇషాన్ కిషన్

బిజీ అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా పాట్ కమిన్స్ అందుబాటులో లేని సమయంలో ఆయనకు ప్రత్యామ్నాయంగా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను కెప్టెన్సీ వారసుడిగా ఎంపిక చేసేందుకు మేనేజ్‌మెంట్ మొగ్గు చూపినట్లు వార్తలు వస్తున్నాయి. అభిషేక్ శర్మ 2019 నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తోనే ప్రయాణిస్తున్నాడు. జట్టులో తన సీనియారిటీ, నిలకడైన ప్రదర్శన ఆధారంగా కెప్టెన్సీ రేసులో తనే ముందుంటానని అభిషేక్ భావించినట్లు తెలుస్తోంది. అయితే ఇషాన్ కిషన్‌కు ప్రాధాన్యం ఇవ్వడంపై అభిషేక్ అసంతృప్తిగా ఉన్నాడని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

రేసులో 4 ప్రముఖ జట్లు!

అభిషేక్ శర్మ SRHను వీడాలని నిర్ణయించుకుంటే, అతన్ని దక్కించుకోవడానికి పలు అగ్రశ్రేణి ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అభిషేక్ శర్మకు మెంటార్‌గా ఉన్న యువరాజ్ సింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ సెటప్‌లో ఉండటంతో ఆ జట్టు వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ కూడా అభిషేక్‌తో సంప్రదింపులు జరిపే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

కొట్టిపారేసిన SRH సీఈవో

ఈ వివాదం సోషల్ మీడియాలో, క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చనీయాంశం కావడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కె.షణ్ముగం స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ కేవలం నిరాధారమైన పుకార్లు మాత్రమేనని ఆయన కొట్టిపారేశారు. అయితే, రాబోయే రిటెన్షన్ జాబితా ఖరారయ్యే వరకు అభిషేక్ భవితవ్యంపై సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉంది.

Tags: