బర్మింగ్ హమ్ లో భారత్ చారిత్రక గెలుపు
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ మ్యాచ్‌లో గిల్ సేన విజయం;
కొన్ని విజయాలు చిరకాలం గుర్తుండిపోతాయి. చిరస్మరణీయాలై నిలిచిపోతాయి. ఆదివారం ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా సాధించిన ఘన విజయం అలాంటిదే! మామూలుగా ఇంగ్లాండ్‌లో గెలుపు అంత ఈజీ కాదు.. అలాంటిది గిల్ సేన చాలా సునాయాసంగా, ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా గెలిచింది. 336 పరుగుల తేడాతో విజయం సాధించడం అంటే మాటలు కాదు. ఈ చారిత్రక విజయంలో జట్టులోని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించారు. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇండియాకు ఇదే మొట్టమొదటి విజయం. ఆ మాటకొస్తే గెలుపొందిన ఆసియన్ టీమ్ కూడా ఇండియానే! ఈ గ్రౌండ్‌లో విజయం సాధించిన మొదటి ఆసియా కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్ ఓ రికార్డు నెలకొల్పాడు.
ఈ వేదికపై భారత్ ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఒక్క విజయం కూడా సాధించలేదు. 8 మ్యాచ్‌ల్లో ఏడింట ఓడి, ఓ మ్యాచ్ డ్రా చేసుకుంది. ఈ గెలుపుతో గిల్ ఎడ్జ్‌బాస్టన్‌లో విజయం సాధించిన తొలి ఆసియా కెప్టెన్‌గా కూడా రికార్డు నెలకొల్పాడు. మొదటి టెస్ట్ మ్యాచ్‌లోనే టీమిండియా గెలిచే ఛాన్స్ ఉండింది. కాకపోతే ఆ అవకాశం చేజారింది. ఈసారి అలాంటి పొరపాట్లకు తావివ్వలేదు. కసికొద్దీ ఆడింది. బ్యాటర్లు భారీ స్కోరుకు బాటలు వేస్తే, బౌలర్లు మిగతా పని చేశారు.
608 పరుగుల టార్గెట్‌ను ఛేదించడం అసాధ్యమే. అందుకే డ్రా చేసుకోవడం కోసం తమ బజ్‌బాల్ ఆట కాకుండా డిఫెన్స్ ఆట ఆడింది ఇంగ్లాండ్. ఆదివారం మూడు వికెట్లకు 72 రన్స్‌తో ఆటను కొనసాగించిన ఇంగ్లాండ్ 271 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇందులో మేజర్ కాంట్రిబుషన్ ఆకాశ్‌దీప్‌దే! మొత్తంగా ఆరు వికెట్లు తీసుకున్నాడు. ఆకాశ్‌దీప్‌కు కెరీర్‌లో అయిదు వికెట్లు తీసుకోవడం ఇదే మొదటిసారి. మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసుకున్న ఆకాశ్‌దీప్ మొత్తంగా పది వికెట్లు తీసుకున్నాడు. రెండు ఇన్నింగ్స్ కలిపి 430 పరుగులు చేసిన కెప్టెన్ శుభమన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. వాన కారణంగా గంటన్నర ఆలస్యంగా ఆట ఆరంభమైనప్పటికీ భారత్ సేన నిరాశకు గురి కాలేదు. పైగా మరింత పట్టుదలతో, దూకుడుతో ఆడింది. ఆట నాలుగో ఓవర్‌లో పోప్ (24)ను పెవిలియన్‌కు పంపించిన ఆకాశ్‌దీప్ ఆ వెంటనే బ్రూక్ (23)ను ఇంటిదారి పట్టించాడు. ఆ తర్వాత స్టోక్స్, జేమీ స్మిత్‌లు జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ను కొనసాగించారు. మరికాసేపట్లో లంచ్ విరామం ఉందన్న టైమ్‌లో స్టోక్స్ (33)ను వాషింగ్టన్ సుందర్ అవుట్ చేశాడు. లంచ్ తర్వాత కూడా స్మిత్ దాటిగానే బ్యాటింగ్ చేశాడు. వోక్స్ ను ప్రసిద్ధ్ వెనక్కి పంపించడంతో ఇండియా గెలుస్తుందన్న నమ్మకం వచ్చేసింది. ఆ నమ్మకానికి తగినట్టుగానే ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఒకరి వెంట ఒకరు పెవిలియన్ బాట పట్టారు. దాంతో ఇండియా 336 పరుగుల విజయాన్ని నమోదు చేసుకుంది. విదేశాల్లో పరుగుల పరంగా ఇదే పెద్ద విజయం.