International Cricket Council (ICC): ఏదో ఒకటి తేల్చుకోండి.. బంగ్లాకు ఐసీసీ డెడ్ లైన్
బంగ్లాకు ఐసీసీ డెడ్ లైన్
International Cricket Council (ICC): టీ20 వరల్డ్ కప్ వేదికల విషయంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) మధ్య వివాదం ముదిరింది. భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు నిరాకరిస్తున్న బంగ్లాదేశ్‌కు ఐసీసీ 24 గంటల అల్టిమేటం జారీ చేసింది.
ఐసీసీ బోర్డు సమావేశంలో బంగ్లాదేశ్ విజ్ఞప్తిని పూర్తిగా తిరస్కరించారు. భారత్‌లో ఆడటంపై 24 గంటల్లోపు (జనవరి 22 నాటికి) తుది నిర్ణయం చెప్పాలని ఐసీసీ స్పష్టం చేసింది. ఒకవేళ బంగ్లాదేశ్ నిరాకరిస్తే, వారి స్థానంలో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మెరుగ్గా ఉన్న స్కాట్లాండ్ (Scotland) జట్టును టోర్నీలోకి తీసుకుంటామని హెచ్చరించింది.భారత్‌లో ఎటువంటి భద్రతా ముప్పు లేదని, స్వతంత్ర భద్రతా సంస్థల నివేదికలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ఐసీసీ పేర్కొంది.
అసలు వివాదం ఏమిటి?
2026 టీ20 వరల్డ్ కప్‌కు భారత్ , శ్రీలంక ఉమ్మడి ఆతిథ్యం ఇస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ తన గ్రూప్-సి (Group C) మ్యాచ్‌లను కోల్‌కతా ,ముంబైలలో ఆడాల్సి ఉంది. అయితే, భారత్‌లో తమ జట్టుకు భద్రతా పరమైన ముప్పు ఉందని పేర్కొంటూ, తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని లేదా గ్రూపులను మార్చాలని బంగ్లాదేశ్ పట్టుబడుతోంది.
ఐపీఎల్ 2026 సీజన్ నుండి బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ నిష్క్రమణ , రెండు దేశాల మధ్య నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కూడా ఈ క్రీడా వివాదానికి కారణంగా కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ వాదనకు మద్దతుగా పాకిస్థాన్ కూడా ఈ అంశంలో జోక్యం చేసుకోవడం గమనార్హం.ఒకవేళ ఈ వరల్డ్ కప్ నుండి తప్పుకుంటే, అది ఆ దేశ క్రికెట్ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ బోర్డు ఇచ్చే సమాధానంపైనే వారి భాగస్వామ్యం ఆధారపడి ఉంటుంది.