ISSF World Shooting Championships: షూటింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత జట్టు సత్తా.. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో పసిడి
25 మీటర్ల పిస్టల్ విభాగంలో పసిడి
ISSF World Shooting Championships: ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో హైదరాబాద్‌కు చెందిన ఈషా సింగ్ మెరిసింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ విభాగంలో భారత్ స్వర్ణం సాధించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది.
రెండు రోజుల పాటు సాగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఈషా అత్యుత్తమంగా 590 పాయింట్లు సాధించగా, మను భాకర్ 587, దివ్య సుబ్బరాజు 584 పాయింట్లు రాబట్టారు. మొత్తంగా 1761 పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకం గెలుచుకుంది. దక్షిణ కొరియా 1748 పాయింట్లతో రజతం, వియత్నాం 1745 పాయింట్లతో కాంస్యం సాధించాయి.
25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఈషా, మను ఫైనల్‌కు చేరుకున్నా పతకాలు మాత్రం సాధించలేకపోయారు. ఈషా ఎనిమిది మంది ఫైనలిస్టుల్లో చివరి స్థానానికి పరిమితం కాగా, మను నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకం కోల్పోయింది. యాంగ్ జిన్ (దక్షిణ కొరియా) 44 పాయింట్లతో స్వర్ణం, ట్రిన్ విన్ (వియత్నాం) 43 పాయింట్లతో రజతం, జాంగ్ (చైనా) 34 పాయింట్లతో కాంస్యం సాధించారు. పతకాలు సాధించిన ఈ ముగ్గురూ 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ కోటా బెర్తులను సాధించారు.
ఈ టోర్నీలో భారత్ నుంచి జైపాల్ మాల్వీయ (పురుషుల 10 మీ. ఎయిర్ పిస్టల్) మాత్రమే ఒలింపిక్ కోటా బెర్తు సాధించాడు.