Smriti Mandhana’s Key Comments on the Defeat: నా వల్లే తప్పు జరిగింది.. ఓటమిపై స్మృతి మంధాన కీలక కామెంట్స్

ఓటమిపై స్మృతి మంధాన కీలక కామెంట్స్

Update: 2025-10-21 07:14 GMT

Smriti Mandhana’s Key Comments on the Defeat: గెలుపు అంచున చేజారిన మ్యాచ్‌.. కీలక సమయంలో స్మృతి మంధాన, దీప్తి శర్మ అనవసర షాట్లతో పెవిలియన్ చేరడంతో టీమ్ఇండియాకు ఓటమి తప్పలేదు. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి.**

మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత మహిళల జట్టు తృటిలో విజయాన్ని కోల్పోయింది. 4 పరుగుల స్వల్ప తేడాతో ఇంగ్లాండ్‌ చేతిలో ఓటమి పాలైంది. గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్న మ్యాచ్‌ను భారత బ్యాటర్ల తప్పిదాల వల్ల చేజేతులా దూరం చేసుకుంది.

రాణించిన బ్యాటర్లు.. నిరాశపరిచిన ముగింపు

తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. అనంతరం 289 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా బ్యాటర్లు అద్భుతంగా రాణించారు.. కానీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. స్మృతి మంధాన (88; 94 బంతుల్లో), హర్మన్‌ప్రీత్ కౌర్ (70; 70 బంతుల్లో), దీప్తి శర్మ (50; 57 బంతుల్లో) హాఫ్ సెంచరీలు నమోదు చేసి జట్టును విజయానికి చేరువగా తీసుకెళ్లారు.

మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి 125 పరుగుల భాగస్వామ్యాన్ని, ఆ తర్వాత దీప్తి శర్మతో కలిసి 67 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అయితే కీలకమైన సమయంలో స్మృతి మంధాన లాంగ్‌ ఆఫ్‌లో అనవసరమైన లాఫ్టెడ్‌ షాట్‌ ఆడి వికెట్‌ కోల్పోవడం, ఆ తర్వాత దీప్తి శర్మ కూడా అదే తరహా అనవసర షాట్‌కు పోయి ఔటవ్వడం టీమిండియా కొంప ముంచింది. దీంతో భారత్ 284 పరుగులకే పరిమితమై ఓటమిని మూటగట్టుకుంది.

నా షాట్ సెలక్షన్ సరిగా లేదు': మంధాన ఆవేదన

మ్యాచ్ అనంతరం టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన మాట్లాడుతూ.. తమ షాట్‌ సెలక్షన్లపై ఆవేదన వ్యక్తం చేసింది. "నిజానికి ఈ మ్యాచ్‌లో మా అందరి షాట్‌ సెలక్షన్లు సరిగా లేవు. నా షాట్‌ సెలక్షన్‌ మరింత మెరుగ్గా ఉండాల్సింది. మేం ఓవర్‌కు కేవలం 6 పరుగులు చేస్తే సరిపోయేది. మేం మరింత జాగ్రత్తగా ఆడి ఉండాల్సింది" అని ఆమె అన్నారు. "వికెట్ల పతనం నాతోనే ప్రారంభమైంది. నేను ఆ సమయంలో ఆ షాట్‌ ఆడకుండా ఉండాల్సింది. అది మిస్‌ హిట్‌ అవడం వల్ల ఔటయ్యాను. నేను మరింత ఓపికగా బ్యాటింగ్‌ చేసి ఉండాల్సింది. క్రీజులో ఉన్నంతవరకు జాగ్రత్తగా ఆడాలనే అనుకున్నాను" అని మంధాన తన తప్పిదాన్ని అంగీకరించింది.

తప్పక గెలవాల్సిందే

ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఆడిన అయిదు మ్యాచుల్లో కేవలం రెండింటినే గెలిచింది. మిగిలిన ఏకైక సెమీస్ బెర్తును దక్కించుకోవాలంటే టీమ్‌ఇండియా తన తదుపరి రెండు మ్యాచుల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్ తన తదుపరి మ్యాచ్ గురువారం నవీ ముంబయి వేదికగా న్యూజిలాండ్‌తో ఆడనుంది.

Tags:    

Similar News