Mahela Jayawardene: ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ పదవి నుంచి మహేల జయవర్ధనే తప్పుకున్నాడు
మహేల జయవర్ధనే తప్పుకున్నాడు
Mahela Jayawardene: శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ శనివారం అధికారికంగా ప్రకటించింది. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు అత్యంత విజయవంతమైన కోచ్‌గా జయవర్ధనే నిలిచాడు.
జయవర్ధనే కోచ్‌గా ఉన్న సమయంలో ముంబై ఇండియన్స్ మూడు ఐపీఎల్ టైటిళ్లను గెలుచుకుంది. 2017, 2019, 2020 సీజన్లలో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. జయవర్ధనే 2017 నుంచి 2022 వరకు ఒకసారి, 2024 నుంచి 2026 వరకు మరోసారి ముంబైకి హెడ్ కోచ్‌గా పనిచేశాడు.
జయవర్ధనే కేవలం కోచ్‌గా మాత్రమే కాకుండా ముంబై ఇండియన్స్ టీమ్ కల్చర్‌ను నిర్మించడంలో కీలక పాత్ర పోషించాడని ఫ్రాంచైజీ తెలిపింది. ఆటగాళ్ల మధ్య మంచి వాతావరణం ఉండేలా చూడటంతో పాటు క్రమశిక్షణ, కలిసి పనిచేయడం, జట్టు ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి అంశాలను ఆయన బలంగా ప్రోత్సహించారని పేర్కొంది.
ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ.. జయవర్ధనే సేవలకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన నాయకత్వం, నిజాయితీ, క్రికెట్‌పై ఉన్న ప్రేమ తమకు ఎంతో ప్రత్యేకమని చెప్పారు. ముంబై ఇండియన్స్ కుటుంబంలో జయవర్ధనే ఎప్పటికీ భాగంగానే ఉంటారని, ఆయన భవిష్యత్తు విజయవంతంగా ఉండాలని ఆకాంక్షించారు.
మరోవైపు మహేల జయవర్ధనే కూడా ముంబై ఇండియన్స్ తన కెరీర్లో ఎంతో ప్రత్యేకమైన భాగమని చెప్పాడు. పదేళ్లకు పైగా సాగిన ఈ ప్రయాణంలో ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, అభిమానులు అందించిన మద్దతును ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపాడు. నీతా అంబానీ, ఆకాష్ అంబానీ తనపై ఉంచిన నమ్మకానికి, అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపాడు.
2022లో ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత జయవర్ధనే ఆ బాధ్యతలను మార్క్ బౌచర్‌కు అప్పగించాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌లో గ్లోబల్ హెడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్‌గా బాధ్యతలు చేపట్టాడు.
ఈ హోదాలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని వివిధ దేశాల్లోని టీ20 లీగ్‌లకు విస్తరించడంలో ఆయన కీలకంగా పనిచేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముంబై ఇండియన్స్ జట్లలో ఒకే విధమైన క్రికెట్ విధానం ఉండేలా కోచింగ్ సిబ్బందితో కలిసి పనిచేశాడు.
ఈ సమయంలో ముంబై ఇండియన్స్ మహిళల జట్టు, MI న్యూయార్క్, MI ఎమిరేట్స్ జట్లు తమ తమ టోర్నీల్లో టైటిళ్లు గెలుచుకున్నాయి. దీంతో ముంబై ఇండియన్స్ గ్లోబల్ ఫ్రాంచైజీగా ఎదగడంలోనూ జయవర్ధనే పాత్ర కీలకంగా నిలిచింది.