Daryl Mitchell: సిక్సర్ కొట్టి తల పట్టుకున్న మిచెల్.. గ్రౌండ్లో తృటిలో తప్పిన ప్రాణాపాయం..
తృటిలో తప్పిన ప్రాణాపాయం..
Daryl Mitchell: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో మైదానంలో ఉన్నవారందరినీ ఉలిక్కిపడేలా చేసిన ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కివీస్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ కొట్టిన ఒక రాకెట్ లాంటి సిక్సర్ బౌండరీ లైన్ వద్ద ఉన్న వ్యక్తి ప్రాణాల మీదికి తెచ్చింది. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో మైదానంలోని ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఆ షాట్ చూసి స్వయంగా మిచెల్ భయంతో కళ్లు మూసుకుని ముఖాన్ని దాచుకోవడం మ్యాచ్‌లోనే హైలైట్‌గా నిలిచింది.
ఏం జరిగింది? మైదానంలో ఏం నడిచింది?
వెల్లింగ్టన్ మైదానం వేదికగా జరిగిన ఈ పోరులో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 6వ ఓవర్ మొదటి బంతికి ఈ ఘటన చోటుచేసుకుంది. భారత బౌలర్ వేసిన బంతిని డారిల్ మిచెల్ కసితీరా భారీ పుల్ షాట్ ఆడాడు. రాకెట్ వేగంతో దూసుకెళ్లిన ఆ బంతి సిక్సర్‌గా బౌండరీ రోప్ దాటింది. అయితే అదే సమయంలో బౌండరీ లైన్ వెలుపల ప్రేక్షకుల గ్యాలరీ వైపు చూస్తూ విధుల్లో ఉన్న ఒక సెక్యూరిటీ స్టీవార్డ్ వైపు ఆ బంతి దూసుకుపోయింది. ఆ స్టీవార్డ్ వెనుక వైపు చూస్తుండటంతో బంతి వస్తున్న సంగతి అతనికి తెలియదు. బంతి నేరుగా వెళ్లి అతడి తలకు కొన్ని అంగుళాల దూరంలో పక్కనుంచి దూసుకెళ్లింది.
భయంతో ముఖం దాచుకున్న మిచెల్!
బంతి దూసుకెళ్లిన తీరును చూసిన డారిల్ మిచెల్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. బంతి బౌండరీ లైన్ వద్ద ఉన్న వ్యక్తి తల వెనుక భాగానికి బలంగా తగిలి ఉంటే అతడు తీవ్రంగా గాయపడటమే కాకుండా ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉండేది. ఈ ప్రమాదాన్ని ఊహించిన మిచెల్, షాట్ కొట్టిన వెంటనే తీవ్ర ఆందోళనతో తన రెండు చేతులతో ముఖాన్ని దాచుకున్నాడు. బంతి అతనికి తగలకుండా తప్పించుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మ్యాచ్‌లో చెలరేగిన కివీస్ బ్యాటర్లు
ఈ ఘటనను పక్కన పెడితే.. మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ దూకుడుగా ఆడింది. డారిల్ మిచెల్, ఓపెనర్ ఫిన్ అలెన్ కలిసి భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు.హవీరిద్దరూ రెండో వికెట్‌కు కేవలం 43 బంతుల్లోనే 86 పరుగుల విధ్వంసకర భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మిచెల్ 20 బంతుల్లోనే 40 పరుగులు సాధించగా, అలెన్ 23 బంతుల్లో 40 రన్స్ జోడించాడు. ఈ ప్రమాదకర జోడీని భారత యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి విడదీశాడు. నితీష్ వేసిన బంతిని భారీ షాట్ ఆడబోయిన ఫిన్ అలెన్.. లాంగ్ ఆన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న నమన్ ధీర్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్ చేరాడు. అయినప్పటికీ మిచెల్ కొట్టిన ఆ షాట్ తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.