Pakistan Super League (PSL): ఐపీఎల్ తరహాలో పీఎస్ఎల్ ప్లేయర్స్ వేలం
పీఎస్ఎల్ ప్లేయర్స్ వేలం
Pakistan Super League (PSL): పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 11వ సీజన్‌కు ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక మార్పులను ప్రకటించింది. ఇప్పటి వరకు అనుసరిస్తున్న 'డ్రాఫ్ట్' పద్ధతికి స్వస్తి పలికి, ఐపీఎల్ తరహాలో ప్లేయర్స్ వేలం పద్ధతిని ప్రవేశపెట్టింది. ఈ కొత్త మార్పుల వల్ల పారదర్శకత పెరగడమే కాకుండా, ఆటగాళ్లకు మెరుగైన సంపాదన లభిస్తుందని బోర్డు భావిస్తోంది. ఈ వేలం కోసం ఒక్కో ఫ్రాంచైజీకి కేటాయించే మొత్తాన్ని (Purse) 1.3 మిలియన్ డాలర్ల నుండి 1.6 మిలియన్ డాలర్లకు పెంచారు.
రిటెన్షన్ నిబంధనల్లో కూడా బోర్డు సమూల మార్పులు చేసింది. గతంలో ఎనిమిది మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అవకాశం ఉండగా, ఇప్పుడు గరిష్టంగా నలుగురిని మాత్రమే రిటైన్ చేసుకోవడానికి అనుమతిస్తారు. అలాగే గతంలో ఉన్న మెంటర్, బ్రాండ్ అంబాసిడర్, 'రైట్ టు మ్యాచ్' (RTM) వంటి నిబంధనలను బోర్డు పూర్తిగా రద్దు చేసింది. దీనివల్ల వేలంలో పోటీ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.
కొత్తగా లీగ్‌లోకి వస్తున్న హైదరాబాద్, సియాల్‌కోట్ జట్లు వేలానికి ముందే అందుబాటులో ఉన్న ఆటగాళ్ల పూల్ నుండి నలుగురు ప్లేయర్లను ఎంచుకోవచ్చు. అలాగే ప్రతి జట్టు మునుపటి సీజన్‌లో ఆడని ఒక విదేశీ ఆటగాడిని నేరుగా ఒప్పందం చేసుకునే వీలు కల్పించారు. పీఎస్ఎల్ 11వ సీజన్ మార్చి 26 నుండి ప్రారంభం కానుంది. ఈసారి మ్యాచ్‌ల నిర్వహణ కోసం కొత్త వేదికగా ఫైసలాబాద్‌ను కూడా చేర్చారు.