Parthiv Patel’s Sensational Comments: మ్యాచ్ ఫిక్సింగ్‌పై పార్థివ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు

పార్థివ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు

Update: 2026-01-19 14:43 GMT

Parthiv Patel’s Sensational Comments: ఐపీఎల్ 2026 సీజన్ సమీపిస్తున్న వేళ క్రికెట్ వర్గాల్లో ఫిక్సింగ్ చర్చలు మరోసారి వేడెక్కాయి. మాజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆటగాడు, ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ సహాయ కోచ్‌గా వ్యవహరిస్తున్న పార్థివ్ పటేల్ ఈ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు ఐపీఎల్ ఫిక్సింగ్ ఆరోపణలతో దెబ్బతిన్నప్పటికీ, ప్రస్తుతం ఉన్న కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల వల్ల ఫిక్సింగ్ జరగడం అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, మైదానంలోకి లేదా డ్రెస్సింగ్ రూమ్‌లోకి ఎవరు ప్రవేశిస్తున్నారనే దానిపై నిరంతరం నిఘా ఉంటుందని ఆయన వెల్లడించారు.

ముఖ్యంగా డ్రెస్సింగ్ రూమ్ ప్రవేశం గురించి పార్థివ్ మాట్లాడుతూ, అక్కడ భద్రత ఏ స్థాయిలో ఉంటుందంటే.. జట్టు కెప్టెన్‌కు కూడా సరైన అక్రిడిటేషన్ (గుర్తింపు కార్డు) లేకపోతే లోపలికి అనుమతించరని పేర్కొన్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లోకి, హోటల్ గదుల్లోకి ఎవరెవరు ప్రవేశించవచ్చో వారి ఫోటోలు ముందే భద్రతా సిబ్బంది వద్ద ఉంటాయని, ఆ జాబితాలో లేని వారు ఎంతటి వారైనా సరే లోపలికి వెళ్లడం కుదరదని చెప్పారు. కేవలం ఆటగాళ్ల కదలికలే కాకుండా, వారి ఫోన్ కాల్స్, ఈమెయిల్స్, హోటల్‌లో వారిని కలవడానికి వచ్చే వారి వివరాలన్నీ రికార్డ్ చేయబడతాయని ఆయన వివరించారు.

మ్యాచ్ ఫిక్సింగ్ అనేది బయట మాట్లాడుకున్నంత సులభం కాదని, అంతర్జాతీయ క్రికెట్‌లో లేదా ఐపీఎల్‌లో ఫిక్సింగ్ చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యమని పార్థివ్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో 2013లో జరిగిన స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం తర్వాత బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం (ACU) నిబంధనలను మరింత కఠినతరం చేసిందని ఆయన గుర్తు చేశారు. ఐపీఎల్ 2026లో తమ అభిమాన జట్లు బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్న తరుణంలో, ఆట యొక్క పారదర్శకతపై ఒక సీనియర్ ఆటగాడు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Tags:    

Similar News