Captain of Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్‌గా రవీంద్ర జడేజా

కెప్టెన్‌గా రవీంద్ర జడేజా

Update: 2026-01-05 05:32 GMT

Captain of Rajasthan Royals: ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు క్రికెట్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై రాజస్థాన్ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

జనవరి 4, ఆదివారం నాడు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తమ అధికారిక ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో రవీంద్ర జడేజా ఫోటోను షేర్ చేస్తూ "దళపతి" అని క్యాప్షన్ ఇచ్చింది. దీనితో పాటు "త్వరలోనే" (Coming Soon) అనే సంకేతాన్ని కూడా జోడించింది. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున ఆడిన జడేజాను అభిమానులు ప్రేమగా 'దళపతి' అని పిలుచుకుంటారు. ఇప్పుడు అదే పదాన్ని రాజస్థాన్ రాయల్స్ వాడటంతో, జడేజానే తమ తదుపరి కెప్టెన్ అని ఫ్రాంచైజీ పరోక్షంగా స్పష్టం చేసినట్లు అభిమానులు భావిస్తున్నారు.

ఐపీఎల్ 2026కు ముందు జరిగిన భారీ ట్రేడింగ్ డీల్‌లో భాగంగా, రాజస్థాన్ రాయల్స్ తమ కెప్టెన్ సంజూ శాంసన్ను చెన్నై సూపర్ కింగ్స్‌కు వదులుకుంది. బదులుగా సీఎస్కే నుంచి రవీంద్ర జడేజా, శామ్ కర్రన్‌లను రాజస్థాన్ జట్టులోకి తీసుకుంది. గత ఐదు సీజన్లుగా రాజస్థాన్‌ను నడిపించిన శాంసన్ నిష్క్రమణతో, జట్టుకు నమ్మకమైన సారథి అవసరమయ్యాడు. యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ వంటి యువ ఆటగాళ్ల పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ, జడేజా అనుభవానికి యాజమాన్యం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

రవీంద్ర జడేజాకు రాజస్థాన్ రాయల్స్ కొత్తేమీ కాదు. 2008లో జరిగిన మొట్టమొదటి ఐపీఎల్ సీజన్‌లో షేన్ వార్న్ సారథ్యంలో రాజస్థాన్ టైటిల్ గెలిచినప్పుడు జడేజా ఆ జట్టులో కీలక సభ్యుడు. అప్పట్లో వార్న్ అతడిని 'రాక్‌స్టార్' అని పిలిచేవారు. సుమారు 17 ఏళ్ల తర్వాత మళ్ళీ తన పాత గూటికి జడేజా తిరిగి రావడం విశేషం. 37 ఏళ్ల జడేజా, తన అపారమైన అనుభవంతో జట్టును ముందుండి నడిపిస్తాడని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News