Rishabh Pant: టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్‌కు మరో కీలక బాధ్యత దక్కింది. 2026 ఇరానీ కప్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా (ROI) జట్టుకు పంత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 2025-26 రంజీ ట్రోఫీ విజేత జమ్మూ కశ్మీర్‌తో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 1 నుంచి 5 వరకు శ్రీనగర్‌లోని షేర్-ఇ-కశ్మీర్ స్టేడియంలో జరగనుంది.

స్టార్ ఆటగాళ్లతో కూడిన రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకు పంత్ నాయకత్వం వహించనున్నాడు. ఈ జట్టులో సర్ఫరాజ్ ఖాన్, మానవ్ సుథార్, ముఖేష్ కుమార్, సారంశ్ జైన్, హర్ష్ దూబే, ఆకాశ్ దీప్ తదితరులు చోటు దక్కించుకున్నారు. అయితే ఆకాశ్ దీప్ ఇరానీ కప్‌లో ఆడటం అతని ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుంది. ఢిల్లీకి చెందిన సనత్ సంగ్వాన్, ఆయుష్ దోసేజా కూడా జట్టులో ఉన్నారు. బెంగాల్ ఆటగాడు సుదీప్ ఘరామి, జార్ఖండ్‌కు చెందిన శిఖర్ మోహన్, కర్ణాటక బ్యాటర్ స్మరణ్ రవిచంద్రన్‌కు కూడా చోటు లభించింది. ఇటీవల ముగిసిన 2026 దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ తరఫున శిఖర్ మోహన్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్ధసెంచరీలు చేశాడు. అతని బ్యాటింగ్‌తో ఇషాన్ కిషన్ నేతృత్వంలోని ఈస్ట్ జోన్ జట్టు టైటిల్ గెలుచుకుంది. ఇరానీ కప్‌లో మోహన్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది.

రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు: రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), సనత్ సంగ్వాన్, శిఖర్ మోహన్, సుదీప్ ఘరామి, సర్ఫరాజ్ ఖాన్ (వైస్ కెప్టెన్), స్మరణ్ రవిచంద్రన్, మానవ్ సుథార్, సారంశ్ జైన్, ఆకాశ్ దీప్, ముఖేష్ కుమార్, ముఖేష్ చౌదరి, ఆర్యన్ జుయల్ (వికెట్ కీపర్), ఆర్యన్ పాండే, అనుకూల్ రాయ్, ఆయుష్ దోసేజా.

రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకు కెప్టెన్‌గా పంత్ ఎంపిక కావడంతో.. వెస్టిండీస్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు భారత జట్టులో అతనికి చోటు దక్కలేదు. 2024 ఆగస్టు తర్వాత పంత్ భారత్ తరఫున వన్డే మ్యాచ్ ఆడలేదు. అతని స్థానంలో కేఎల్ రాహుల్‌కు డిప్యూటీగా ధ్రువ్ జురెల్‌ను ఎంపిక చేశారు. ఇరానీ కప్ మ్యాచ్ పంత్‌కు కీలకంగా మారనుంది. న్యూజిలాండ్‌తో భారత్ ఆడనున్న ఆల్‌ఫార్మాట్ సిరీస్‌కు ముందు అతనికి మ్యాచ్ ప్రాక్టీస్ లభించనుంది. అక్టోబర్‌లో భారత్ న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఈ టూర్‌లో ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు జరగనున్నాయి. న్యూజిలాండ్‌తో జరగనున్న రెండు టెస్టుల్లో పంత్ భారత జట్టుకు కీలక ఆటగాడిగా ఉండనున్నాడు. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు 2027 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశాలను కొనసాగించాలంటే ఈ రెండు టెస్టుల్లో విజయం సాధించడం ముఖ్యంగా మారింది. ఈ నేపథ్యంలో ఇరానీ కప్ ద్వారా పంత్‌కు లభించే మ్యాచ్ ప్రాక్టీస్‌పై ఆసక్తి నెలకొంది.

Tags: