ICC Player of the Month Award: షెఫాలి వర్మకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు..
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు..
ICC Player of the Month Award: భారత మహిళా క్రికెట్ జట్టు యువ సంచలనం షెఫాలి వర్మ నవంబర్ 2025 నెలకుగాను ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకుంది. ఇటీవలే భారత మహిళల జట్టు 2025 వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకోవడంలో షెఫాలి ప్రదర్శన కీలకంగా నిలిచింది. ప్రతీక రావల్ గాయం కారణంగా అనుకోకుండా జట్టులోకి వచ్చిన షెఫాలి వర్మ, దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రపంచకప్ ఫైనల్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. బ్యాటింగ్‌లో 78 బంతుల్లోనే 87 పరుగులు చేసి టీమ్ ఇండియా తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచింది. బౌలింగ్‌లో ఏడు ఓవర్లు వేసిన ఆమె 36 పరుగులు ఇచ్చి, కీలక సమయంలో రెండు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను భారత్ వైపు మలుపుతిప్పింది.
అవార్డుపై షెఫాలి సంతోషం
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు దక్కడంపై షెఫాలి వర్మ సంతోషం వ్యక్తం చేసింది. "ఫైనల్‌లో జట్టు విజయానికి నేను దోహదపడినందుకు సంతోషిస్తున్నా. స్వదేశంలో ప్రేక్షకుల ముందు మొదటిసారిగా ప్రపంచకప్‌ను గెలిచి చరిత్ర సృష్టించడంలో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ అవార్డును నా సహచరులు, కోచ్‌లు, కుటుంబం, ఇప్పటి వరకు నా ప్రయాణానికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ అంకితం చేస్తున్నాను. మేము జట్టుగా గెలుస్తాం.. ఈ అవార్డు విషయంలో కూడా అంతే" అని షెఫాలి తెలిపింది.
పురుషుల విభాగంలో సైమన్ హార్మర్
పురుషుల విభాగంలో నవంబర్ 2025 నెలకుగాను దక్షిణాఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును దక్కించుకున్నాడు. భారత్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో హార్మర్ మొత్తం 17 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. అవార్డుపై హార్మర్ మాట్లాడుతూ.. "ఈ అవార్డుకు ఎంపిక కావడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. సౌతాఫ్రికా తరఫున ఆడాలనే నా కల నిజమైంది. దాని ఫలితంగా వచ్చే ఫలితమేదైనా బోనస్ లాంటిది. మరింత కాలం సౌతాఫ్రికాకు ఆడి జట్టు విజయాల్లో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాను" అని తెలిపాడు.