Shreyas Iyer Health Stable: శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యం నిలకడగా ఉంది! - బీసీసీఐ రెండో మెడికల్ అప్‌డేట్
బీసీసీఐ రెండో మెడికల్ అప్‌డేట్
Shreyas Iyer Health Stable: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో గాయపడిన భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ (BCCI) రెండో మెడికల్ అప్‌డేట్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం శ్రేయస్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయనను వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు బీసీసీఐ ప్రకటించింది.సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో క్యాచ్ పట్టే ప్రయత్నంలో శ్రేయస్ అయ్యర్ ఎడమ పక్కటెముకల ప్రాంతంలో గాయపడ్డారు. స్కానింగ్‌లో ఆయన ప్లీహానికి చీలిక ఏర్పడినట్లు తేలింది. దీని కారణంగా అంతర్గత రక్తస్రావం కూడా జరిగింది. గాయం తక్షణమే గుర్తించబడి, రక్తస్రావాన్ని నిలిపివేశారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. బీసీసీఐ ఇచ్చిన తాజా సమాచారం ప్రకారం స్కాన్‌లో గణనీయమైన మెరుగుదల కనిపించింది. ప్రస్తుతం అయ్యర్ ఆరోగ్యం వైద్యపరంగా నిలకడగా ఉందని, ఆయన కోలుకుంటున్నారని బీసీసీఐ తెలిపింది. సిడ్నీ, భారతదేశంలోని నిపుణులతో సంప్రదించి బీసీసీఐ మెడికల్ టీమ్ ఆయన గాయాన్ని నిశితంగా పర్యవేక్షిస్తోంది. భారత జట్టు డాక్టర్ ఆయన దినసరి పురోగతిని అంచనా వేయడానికి శ్రేయస్‌తో పాటే సిడ్నీలో కొనసాగనున్నారు. గాయం తీవ్రత కారణంగా శ్రేయస్ అయ్యర్ మరికొంత కాలం పాటు ఆటకు దూరంగా ఉండనున్నారు. అయితే, ఆయన కోలుకుంటున్నారన్న వార్త భారత క్రికెట్ అభిమానులకు ఉపశమనాన్ని ఇచ్చింది.