Gavaskar Counters Shahid Afridi: క్రీడలు, రాజకీయాలు వేర్వేరు కాదు.. షాహిద్ అఫ్రిదికి గావస్కర్ కౌంటర్
షాహిద్ అఫ్రిదికి గావస్కర్ కౌంటర్
Gavaskar Counters Shahid Afridi: ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య షేక్ హ్యాండ్ వివాదంపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలకు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. క్రీడలు, రాజకీయాలు వేర్వేరుగా చూడాలని అఫ్రిది చేసిన వ్యాఖ్యలను గావస్కర్ తీవ్రంగా వ్యతిరేకించారు. "గత కొన్నేళ్ల చరిత్రను చూస్తే, క్రీడలు, రాజకీయాలు ఎప్పుడూ వేర్వేరుగా ఉండవు. ఇక్కడ నేను ఎవరినీ విమర్శించడం లేదు. కానీ మీరు రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు, ఈ అంశాలన్నీ అందులోకి వస్తాయి" అని గావస్కర్ ఘాటుగా స్పందించారు.
అఫ్రిది వ్యాఖ్యలు
ఆసియా కప్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోయిన తర్వాత భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంపై అఫ్రిది ఒక టీవీ చర్చా కార్యక్రమంలో మాట్లాడారు. సోషల్ మీడియాలో బాయ్‌కాట్ ప్రచారం కారణంగా భారత ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగిందని, అందుకే వారు షేక్‌హ్యాండ్ ఇవ్వలేదని అఫ్రిది అన్నారు. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు.
గావస్కర్ కౌంటర్
అఫ్రిది వ్యాఖ్యలకు సమాధానమిస్తూ.. గావస్కర్ పాకిస్థాన్ జట్టు ఓటమి తర్వాత వారి కెప్టెన్ సల్మాన్ అఘా ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హాజరు కాకపోవడాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. "విజయం సాధించిన జట్టు కెప్టెన్ ఏం చెబుతాడనేది మాత్రమే ప్రజలు ఆసక్తిగా వింటారు. ఓడిపోయిన జట్టు గురించి పట్టించుకోరు’’ అని గావస్కర్ వ్యంగ్యంగా అన్నారు. అఫ్రిది ఇంతకుముందు రాహుల్ గాంధీని ప్రశంసించిన విషయాన్ని కూడా ఆయన పరోక్షంగా గుర్తుచేస్తూ కౌంటర్ ఇచ్చారు.