Suryakumar Yadav: టీ20ల్లో సూర్యకుమార్ సరికొత్త రికార్డు
సరికొత్త రికార్డు
Suryakumar Yadav: టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన కెరీర్‌లో మరో అరుదైన ఘనతను అందుకున్నారు. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బుధవారం (జనవరి 21) న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో సూర్య ఈ మైలురాయిని చేరుకున్నారు. ఈ మ్యాచ్‌లో 22 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 32 పరుగులు చేసిన సూర్య.. టీ20 ఫార్మాట్‌లో 9000 పరుగుల మార్కును అధిగమించారు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో భారతీయ బ్యాటర్‌గా ఆయన చరిత్ర సృష్టించారు.
సూర్యకుమార్ కంటే ముందు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ మాత్రమే టీ20ల్లో 9000 పరుగుల మైలురాయిని దాటారు. ప్రస్తుత గణాంకాల ప్రకారం, భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ 13,543 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, రోహిత్ శర్మ 12,248 పరుగులతో రెండో స్థానంలో ఉన్నారు. గత కొంతకాలంగా సరైన ఫామ్‌లో లేక విమర్శలు ఎదుర్కొంటున్న సూర్యకుమార్, ఈ మ్యాచ్‌లో విలువైన పరుగులు సాధించి తన ఆత్మవిశ్వాసాన్ని చాటుకున్నారు.
కేవలం పరుగులు సాధించడమే కాకుండా, సూర్యకుమార్ అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న ఆటగాళ్ల జాబితాలోనూ నిలిచారు. టీ20 స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందిన ఆయన, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున, అంతర్జాతీయ స్థాయిలో భారత్ తరపున ఆడుతూ ఈ భారీ స్కోరును నమోదు చేశారు. 2026 టీ20 ప్రపంచకప్‌కు ముందు కెప్టెన్ సూర్య ఫామ్‌లోకి రావడం భారత జట్టుకు సానుకూల అంశంగా కనిపిస్తోంది.
ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ (84) మెరుపు ఇన్నింగ్స్‌కు తోడు సూర్యకుమార్ క్విక్ కామియో తోడవడంతో భారత్ భారీ స్కోరు సాధించి విజయం దిశగా అడుగులు వేసింది. తన 360 డిగ్రీల బ్యాటింగ్‌తో అలరించే సూర్య, రాబోయే మ్యాచ్‌ల్లో మరిన్ని భారీ స్కోర్లు సాధించి తన ఫామ్‌ను నిరూపించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.