Irani Cup: మూడోసారి విధర్భదే ఇరానీ కప్..రెస్టాఫ్ ఇండియాపై గ్రాండ్ విక్టరీ
రెస్టాఫ్ ఇండియాపై గ్రాండ్ విక్టరీ
Irani Cup: రంజీ ట్రోఫీ ఛాంపియన్ విధర్భ జట్టు ఇరానీ కప్ మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. మూడోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. విధర్భ జట్టు రెస్ట్ ఆఫ్ ఇండియా (Rest of India - RoI) జట్టును 93 పరుగుల తేడాతో ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది.
విధర్భ తొలి ఇన్నింగ్స్ లో 342 పరుగులు చేసింది. ఓపెనర్ అథర్వ తైడే 143 పరుగులతో కీలక శతకం నమోదు చేశాడు. రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 214 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో విధర్భకు 128 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
విధర్భ రెండో ఇన్నింగ్స్ లో 232 పరుగులకు ఆలౌట్ అయింది. రెస్ట్ ఆఫ్ ఇండియా ముందు 361 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రెస్ట్ ఆఫ్ ఇండియా రెండో ఇన్నింగ్స్ లో 267 పరుగులకు ఆలౌట్ అయింది. హర్ష్ దూబే (4/73),యశ్ ఠాకూర్ (2/47) అద్భుతమైన బౌలింగ్‌తో విధర్భ విజయాన్ని ఖాయం చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన అథర్వ తైడేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది.
విధర్భ జట్టుకు ఇది మూడో ఇరానీ కప్ టైటిల్. వారు గెలిచిన మూడుసార్లు కూడా రంజీ ట్రోఫీ ఛాంపియన్‌లుగానే ఇరానీ కప్ ఆడారు.రంజీ ఛాంపియన్ ఇరానీ కప్‌ను పూర్తిగా మ్యాచ్ గెలిచి కైవసం చేసుకోవడం 2014/15 సీజన్ తర్వాత ఇదే తొలిసారి. మునుపటి రెండు విజయాలు (2017/18, 2018/19) కేవలం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా వచ్చాయి.