Gavaskar: మా జట్టు గురించి మీకెందుకు?.. విదేశీ మాజీ ఆటగాళ్లపై గావస్కర్ ఫైర్
విదేశీ మాజీ ఆటగాళ్లపై గావస్కర్ ఫైర్;
Gavaskar: ఆసియా కప్ కోసం టీమ్‌ఇండియా జట్టు ఎంపికపై విదేశీ మాజీ ఆటగాళ్లు చేస్తున్న విమర్శలపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తీవ్రంగా మండిపడ్డారు. భారత క్రికెట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తగదని, మన జట్టుపై వ్యాఖ్యలు చేసే హక్కు వారికి లేదని ఆయన స్పష్టం చేశారు. బీసీసీఐ ఇటీవల సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ఆసియా కప్ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ జట్టులో శ్రేయస్ అయ్యర్, జైస్వాల్ లాంటి ఆటగాళ్లను విస్మరించడంపై ఏబీ డివిలియర్స్ వంటి మాజీ ఆటగాళ్లు వ్యాఖ్యలు చేశారు. శ్రేయస్‌ను తీసుకోవాల్సి ఉండేదని ఏబీ డివిలియర్స్ వ్యాఖ్యానించారు. దీనిపై గావస్కర్ ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ తీవ్రంగా స్పందించారు.
మీ దేశం గురించి ఆలోచించుకోండి
‘‘భారత క్రికెట్‌పై తక్కువ అవగాహన ఉన్న విదేశీ ఆటగాళ్లు మన జట్టుపై చర్చలు జరిపి అగ్నికి ఆజ్యం పోస్తున్నారు’’ అని గావస్కర్ ఆరోపించారు. ‘‘వారు ఎంత గొప్ప ఆటగాళ్లు అయినా, భారత్‌కు ఎన్నిసార్లు వచ్చినా.. మన జట్టు ఎంపిక వారి పని కాదు. వాళ్ల దేశపు క్రికెట్‌పై వారు దృష్టిపెట్టాలి. మన క్రికెట్ గురించి వారికెందుకు ఆందోళన?’’ అని ప్రశ్నించారు. వాళ్ల దేశపు జట్లను ప్రకటించినప్పుడు ఆశ్చర్యకరంగా వారి నుంచి ఇలాంటి కామెంట్లు వినబడవు’’ అని గావస్కర్ వ్యంగ్యంగా అన్నారు.
విదేశీ జట్ల ఎంపికలపై మన మాజీ ఆటగాళ్లు ఎప్పుడూ వ్యాఖ్యలు చేయరని, ఎందుకంటే మనం మన సొంత పని గురించి మాత్రమే ఆలోచిస్తామని ఆయన పేర్కొన్నారు. కేవలం సోషల్ మీడియాలో ప్రచారం పొందాలనే లక్ష్యంతోనే విదేశీ ఆటగాళ్లు టీమ్‌ఇండియాను టార్గెట్ చేస్తుంటారని గావస్కర్ ఆరోపించారు.