Wriddhiman Saha Begins a New Innings: కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టిన వృద్ధిమాన్ సాహా.. ఆ జట్టుకు హెడ్ కోచ్‌గా నియామకం
ఆ జట్టుకు హెడ్ కోచ్‌గా నియామకం;
Wriddhiman Saha Begins a New Innings: భారత సీనియర్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్ సాహా తన క్రికెట్ కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. ఇటీవల క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన సాహా, ఇప్పుడు బెంగాల్ అండర్-23 పురుషుల జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. గత వారం ఈడెన్ గార్డెన్స్‌లో కోచ్‌గా తన తొలి సెషన్‌ను ప్రారంభించిన ఆయన, ఆటగాళ్లకు కీలక సూచనలు చేశారు.
జట్టు స్ఫూర్తిపై సాహా దృష్టి
సాహా తన తొలి శిక్షణా సెషన్‌లో ఆత్మవిశ్వాసం, జట్టుకృషి ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ‘‘ఒక జట్టుగా మనం మన నైపుణ్యాలపై దృష్టి పెట్టాలి. సహచరులకు సహాయం చేయాలి. ఎవరికీ వ్యక్తిగత లక్ష్యాలు ఉండకూడదు. మనపై మనం నమ్మకం ఉంచుకోవాలి, శిక్షణ సమయంలో నేర్చుకున్న వాటిని మ్యాచ్‌లలో అమలు చేయాలి’’ అని ఆటగాళ్లకు దిశానిర్దేశం చేశారు. మాజీ అంతర్జాతీయ క్రికెటర్లు ఉత్పల్ ఛటర్జీ, దేబబ్రత దాస్ ఆయనకు అసిస్టెంట్ కోచ్‌లుగా సహకరిస్తారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఆనందం పంచుకున్న సాహా
కొత్త పాత్రపై సాహా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన సంతోషాన్ని పంచుకున్నారు. ‘‘కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతున్నాను. బెంగాల్ అండర్-23 జట్టుకు ప్రధాన కోచ్‌గా నా ప్రయాణం ప్రారంభించడం గర్వంగా ఉంది. కోచింగ్ అంటే సూచనలు ఇవ్వడం మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, నైపుణ్యాలను మెరుగుపరచడం, జట్టును నిర్మించడం. ఆట పట్ల మక్కువ ఉన్న ప్రతిభావంతులైన యువకులతో పనిచేయడం, కొత్త పాత్రలో ఈడెన్ గార్డెన్స్‌కు తిరిగి రావడం చాలా ప్రత్యేకం’’ అని పేర్కొన్నారు.
18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో సాహా బెంగాల్ తరపున 15 ఏళ్లు, త్రిపుర తరపున 2 ఏళ్లు దేశీయ క్రికెట్ ఆడారు. 142 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 14 సెంచరీలతో 7169 పరుగులు చేశారు. 2010లో భారత జట్టులోకి అరంగేట్రం చేసి 40 టెస్ట్ మ్యాచ్‌లలో 3 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలతో 1353 పరుగులు సాధించారు. ధోని తర్వాత టెస్టుల్లో రిషబ్ పంత్‌తో పాటు భారత జట్టులో కీలక వికెట్ కీపర్‌గా ఆయన గుర్తింపు పొందారు.