Konda Surekha: కొండా సురేఖపై చర్యలకు రంగం సిద్ధం.. అధిష్ఠానానికి నివేదిక సమర్పణ
నివేదిక సమర్పణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ (డీఏసీ) నివేదిక సిద్ధం చేసింది. ఆమె వైఖరి సరికాదని, పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధిష్ఠానానికి తాజా నివేదిక పంపినట్లు సమాచారం. ఈ నివేదికను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు అందజేయనున్నారు. సోమవారం సాయంత్రం ఏఐసీసీకి ఈ నివేదిక పంపనున్నట్లు తెలుస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిపై మంత్రి కుమార్తె సుస్మిత చేసిన అసత్య ఆరోపణలను సురేఖ సమర్థించడం, ఖండించకపోవడం పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు తీవ్రంగా తప్పుపట్టారు. ఆమె ‘ఇది తనపై జరుగుతున్న కుట్ర’ అని లేఖ రాయడంతో వివాదం మరింత ముదిరింది. ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేలా సుస్మిత మాట్లాడినా సురేఖ ఖండించకపోగా, పార్టీ నేతలపై అభాండాలు వేయడం సరికాదని పీసీసీ, డీఏసీ భావిస్తున్నాయి. ఈ విషయాన్ని ఏఐసీసీకి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌కు పీసీసీ వివరించింది.
క్రమశిక్షణ కమిటీ సురేఖ వివరణపై సంతృప్తి చెందలేదు. సీఎం, ప్రభుత్వం, పార్టీపై ఎవరు తప్పుడు మాటలు మాట్లాడినా తప్పనిసరిగా చర్యలు ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. సురేఖతో పాటు మరో ఇద్దరి వ్యవహారంపై కఠిన నిర్ణయం తీసుకునేలా సిఫారసు చేసినట్లు సమాచారం. చిన్నారెడ్డిపైనా పార్టీ సీరియస్‌గా ఉంది. ఇద్దరిపై ఒకేసారి చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలోనూ సుస్మిత అసత్య ఆరోపణలు చేసినప్పుడు చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇప్పుడు సీఎంపైనే దాడికి దిగారని వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. తమ జిల్లాలోని ఏ ఒక్క ఎమ్మెల్యేతోనూ సురేఖకు పొసగడం లేదని, అభివృద్ధి పనులకు ఆమె ఎలా సహకరిస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు భారాస, భాజపాలకు సహకరించే తీరులో మాట్లాడుతున్నట్లు, వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు పార్టీ నేతలు ఏఐసీసీకి చెప్పారు.
సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించాలని, వైఖరి మార్చుకోకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏఐసీసీకి చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆమెను తప్పిస్తే అదే సామాజిక వర్గం, ఉత్తర తెలంగాణ నుంచి బీసీలకు అవకాశం కల్పించాలనే చర్చ పార్టీలో సాగుతోంది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో పాటు మరికొందరి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణ, శాఖల మార్పులకు ఇది దారి తీయవచ్చని నేతలు అంటున్నారు.
ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. ఏఐసీసీ నేతలు సీఎం, పీసీసీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి సహా ముఖ్యనేతలతో మాట్లాడి సురేఖ వ్యవహారశైలిపై వివరాలు అడిగినట్లు తెలుస్తోంది. క్రమశిక్షణ కమిటీ నివేదిక ఆధారంగానే ఏఐసీసీ తుది నిర్ణయం ప్రకటించనుంది.