AICC In-Charge Sandeep Kumar: పార్టీకి నష్టం కలిగేలా బహిరంగ విమర్శలు చేయొద్దు: ఏఐసీసీ ఇన్చార్జి సందీప్‌కుమార్ ఎమ్మెల్యేలకు స్పష్టమైన సూచన
| స్పష్టమైన సూచన
AICC In-Charge Sandeep Kumar: తెలంగాణ కాంగ్రెస్‌లో క్రమశిక్షణపై కొత్త ఏఐసీసీ ఇన్చార్జి ఎంఏ సందీప్‌కుమార్ దృష్టి పెట్టారు. ఇటీవలి కాలంలో వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్రబిందువులుగా నిలిచిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డిలతో సోమవారం (నవంబరు 23) రాత్రి విడివిడిగా భేటీ అయ్యారు.
సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వంపైన రాజగోపాల్‌రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పటికే అధిష్ఠానం పరిశీలనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అలాగే నియోజకవర్గంలో అభివృద్ధికి నిధులు విడుదల కావట్లేదని, అధికారుల్లో అవినీతి పెరిగిందంటూ అనిరుధ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలూ కాంగ్రెస్‌లో కలకలం సృష్టించాయి.
ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ఆదేశాల మేరకు సందీప్‌కుమార్‌ను రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి ప్రజాభవన్‌లోని గెస్ట్ హౌస్‌లో కలిశారు.వారితో సందీప్ విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల ముందు పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తానని తనకు హామీ ఇచ్చి అమలు చేయలేదని, అలాగే రేడియల్ రోడ్ల టెండర్లకు సంబంధించిన వివాదం గురించీ రాజగోపాల్‌రెడ్డి ఇన్చార్జికి వివరించినట్లు తెలుస్తోంది. సీనియర్లు అయుండీ పార్టీకి నష్టం కలిగేలా సీఎం రేవంత్, ప్రభుత్వంపైన బహిరంగ విమర్శలు చేయడం సరికాదని సందీప్ అన్నట్లు తెలిసింది.
ఏదైనా ఉంటే తన దృష్టికి తేవాలని, తాను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. అలాగే తాను పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదంటూ అనిరుధ్‌రెడ్డి ఇన్చార్జికి వివరించారు. అభివృద్ధి పనులకు నిధులు విడుదల కాకపోవడంతో నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందన్నారు.
తాను సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకం కాదని, వాస్తవానికి ఆయన ఉద్దండాపూర్‌కు నిధుల కేటాయించి తనకు పెద్ద ఎత్తున మేలూ చేశారని చెప్పుకొచ్చారు. సమస్య ఏదైనా ఉంటే తనకు చెప్పాలని, తాను చూసుకుంటానని అనిరుధ్‌రెడ్డికి చెప్పారు. పార్టీ బలోపేతం, వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడం గురించి చర్చించారు.సందీప్‌కుమార్ పెద్దపల్లి, ఆదిలాబాద్ పంచాయతీలపైనా నేతలతో మాట్లాడారు.
ఇటీవలే మీనాక్షి నటరాజన్ స్థానంలో నియమితులైన సందీప్ పార్టీ ఐక్యత, సమన్వయం కోసం అనేక నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ కూడా అవినీతి గురించి మాట్లాడిన సంగతిని అనిరుధ్‌రెడ్డి గుర్తుచేశారు.బహిరంగ విమర్శలు పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగిస్తాయని, ఫిర్యాదులు అధికారిక ఛానళ్ల ద్వారా తీసుకురావాలని ఇన్చార్జి స్పష్టం చేశారు. రాజగోపాల్‌రెడ్డికి భవిష్యత్తు ఉందని, సహనం పాటించాలని సూచించారు.
అనిరుధ్‌రెడ్డి తన వ్యాఖ్యలు సదుద్దేశంతోనే అని, బిల్లులు క్లియర్ చేయకపోతే ఎవరైనా చనిపోతారన్న మాట తాను అనలేదని స్పష్టం చేశారు.పార్టీ క్రమశిక్షణ కమిటీ, అధిష్ఠానం ఇప్పటికే ఈ వ్యాఖ్యలను పరిశీలిస్తున్నాయి. సందీప్‌కుమార్ ఇతర నేతలతో కూడా భేటీలు కొనసాగించనున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలను సమన్వయం చేసి, వచ్చే ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడమే ఇన్చార్జి లక్ష్యంగా కనిపిస్తోంది.