CM Revanth Reddy Confident: నేను రాజకీయాల్లో ఉన్నంతవరకు కేసీఆర్ అధికారంలోకి రారు: సీఎం రేవంత్ ధీమా

కేసీఆర్ అధికారంలోకి రారు: సీఎం రేవంత్ ధీమా

Update: 2025-12-25 06:52 GMT

2029 ఎన్నికల్లో 2/3 మెజారిటీతో కాంగ్రెస్‌ను మళ్లీ గద్దెనెక్కిస్తా

సర్పంచులు గ్రామాభివృద్ధికి కృషి చేయాలి

చిన్న గ్రామాలకు రూ.5 లక్షలు, పెద్ద గ్రామాలకు రూ.10 లక్షలు అదనం నిధులు


CM Revanth Reddy Confident: కొడంగల్ నియోజకవర్గ సర్పంచుల సన్మాన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ ధీమాను వ్యక్తం చేశారు. ‘నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబం అధికారంలోకి రాదు. ఇది నా శపథం. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చి, 2/3 మెజారిటీ సాధిస్తాం’ అని ఆయన స్పష్టం చేశారు.

నారాయణపేట జిల్లా కోస్గిలో జరిగిన కొడంగల్ నియోజకవర్గ సర్పంచుల సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో పార్టీలకతీతంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సర్పంచులకు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 12,706 మంది సర్పంచులకు ఈ సూచన చేస్తున్నట్లు తెలిపారు. చిన్న గ్రామాలకు రూ.5 లక్షలు, మేజర్ పంచాయతీలకు రూ.10 లక్షలు సీఎం నిధుల నుంచి నేరుగా సర్పంచుల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఇవి కేంద్రం, రాష్ట్రం ఇచ్చే నిధులకు అదనమని, కేంద్రం నుంచి రూ.3 వేల కోట్లు తెచ్చే బాధ్యత తనదని చెప్పారు.

భారాస హయాంలో తనపై 181 కేసులు పెట్టించారని, అయినా పగ తీర్చుకోవడం కంటే రాష్ట్ర అభివృద్ధే ముఖ్యమని ఊరుకున్నట్లు రేవంత్ వివరించారు. కేసీఆర్ ఫాంహౌస్‌నే బందీఖానాగా మార్చామని, భారాస చరిత్ర ఇక గతమేనని ధ్వజమెత్తారు. కేటీఆర్, హరీశ్ రావు సహా భారాస నేతలు రాసిపెట్టుకోవాలని, 2029లో 119 లేదా 153 స్థానాలు ఉన్నా 80 నుంచి 100 సీట్లు కాంగ్రెస్ సాధిస్తుందని హెచ్చరించారు.

ఇటీవల బయటకు వచ్చిన కేసీఆర్ స్థాయికి తగ్గని విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాల్ విసిరారు. కాళేశ్వరం, కృష్ణా-గోదావరి జలాలు, ఫోన్ ట్యాపింగ్ అంశాలపై ఏదైనా చర్చకు సిద్ధమని చెప్పారు. భారాస నేతల బెదిరింపులకు భయపడేది లేదని, మర్యాదగా మాట్లాడుతున్నామని స్పష్టీకరణ ఇచ్చారు.

పాలమూరు ప్రాంత అభివృద్ధిని అడ్డుకున్నారని, భారాస హయాంలో కుటుంబ సభ్యులకు ఫాంహౌసులు, ఆస్తులు వచ్చాయి కానీ ప్రజలకు నీళ్లు రాలేదని రేవంత్ విమర్శించారు. సభలో నియోజకవర్గానికి చెందిన 180 మంది సర్పంచులను శాలువాలతో సన్మానించారు.

Tags:    

Similar News