TPCC Chief Mahesh Kumar Goud: తెలంగాణలో బీసీ సీఎం ఖాయం.. రాహుల్, రేవంత్ మద్దతుతో హక్కు కోసం పోరాటం: మహేశ్‌కుమార్‌గౌడ్
మహేశ్‌కుమార్‌గౌడ్
TPCC Chief Mahesh Kumar Goud: తెలంగాణలో బీసీ నేత ముఖ్యమంత్రి కావడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ స్పష్టం చేశారు. రాహుల్‌గాంధీ సారథ్యంలో జరిగిన భారత్ జోడో యాత్రలోనే బీసీలకు సీఎం పదవి వస్తుందన్న ధైర్యం కలిగిందని ఆయన అన్నారు.
ఆదివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సర్కిల్ పరిధిలోని గొల్లపల్లి సమీపంలో టీపీసీసీ ఓబీసీ సెల్ ఛైర్మన్, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఓబీసీ సింహగర్జన సదస్సులో ఆయన మాట్లాడారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి పాల్గొన్న మహేశ్‌గౌడ్.. అగ్రవర్ణాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సహకారంతో బీసీలకు దక్కాల్సిన వాటాను తీసుకుంటామని, అవసరమైతే హక్కుగా పోరాడి సాధిస్తామని చెప్పారు. బీసీలకు రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు సమన్యాయంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, 2039 వరకు తెలంగాణలో కాంగ్రెసే అధికారంలో ఉంటుందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. పీవీ నర్సింహారావు, మర్రి చెన్నారెడ్డి మాదిరిగా రేవంత్‌రెడ్డి బీసీలకు మద్దతు పలికారని గుర్తు చేశారు. అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపినా కేంద్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. తెలంగాణలోని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలను అడిగే ధైర్యం చూపలేదని విమర్శించారు.
జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు జాతీయ జనగణనలో కాలమ్ లేకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ప్రధాని మోదీ ఓబీసీ అని చెప్పుకుంటూ నమ్మకద్రోహం చేస్తున్నారని, బీసీలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్‌ను బీసీ వ్యతిరేకిగా అభివర్ణించి, తెలంగాణను దోచుకున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో ఓబీసీలు ఏకమై బీజేపీని గద్దెదింపుతారని హెచ్చరించారు.
దేశవ్యాప్తంగా కులగణన జరగాలి: మంత్రి పొన్నం
జాతీయ జనగణనలో బీసీ కులగణన చేస్తేనే అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. దేశంలోనే కులగణన చేసిన ఘనత తెలంగాణ, బిహార్ రాష్ట్రాలకు దక్కిందని ఆయన అన్నారు. కులగణన కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించినది కాదని, బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాల హక్కులకు సంబంధించినదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కులగణన జరగాలన్నది ప్రధాన డిమాండ్ అని, గ్రామస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు ప్రజా ఉద్యమం నిర్మించాలని పిలుపునిచ్చారు.
కులగణన ఆధారంగా సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు, రాజకీయ ప్రాతినిధ్యం నిర్ణయించే అవకాశం ఉంటుందని, కేంద్రం రాజ్యాంగబద్ధమైన అధికారాలు వినియోగించి దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాహుల్‌గాంధీ నాయకత్వంలో జరుగుతున్న కులగణన పోరాటానికి తెలంగాణ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.
సదస్సులో జాతీయ ఓబీసీ సెల్ నాయకుడు లేఖ్‌రామ్ సాహు, బీసీ సంక్షేమ, అభివృద్ధి శాఖల సలహాదారు వీహెచ్, ఎంపీ మల్లు రవి, సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచంద్‌రెడ్డి, ఎమ్మెల్యేలు నవీన్‌యాదవ్, దానం నాగేందర్, రాజ్ ఠాకూర్, మాజీ ఎంపీలు అంజన్‌కుమార్ యాదవ్, మధుయాస్కీగౌడ్, కార్పొరేషన్ ఛైర్మన్లు, డీసీసీ అధ్యక్షురాలు పారిజాతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.