Deputy Chief Minister Bhatti Vikramarka: తెలంగాణలోని ప్రకృతి అందాలకు మరింత ప్రాచుర్యం కల్పించి, పర్యావరణహిత పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి ఐటీ సంస్థల సహకారం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం రాత్రి ప్రజాభవన్‌లో పలు ఐటీ కంపెనీల సీఈవోలు, ప్రముఖ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, సీఎస్‌ సంజయ్‌ జాజు పాల్గొన్నారు. అటవీ, పర్యాటక శాఖల అధికారులు కూడా హాజరయ్యారు. టీసీఎస్‌ నుంచి రాజన్న, హెచ్‌సీఎల్‌ నుంచి కిరణ్‌ చెరుకూరి, ఐ ల్యాబ్స్‌ నుంచి చింతలపాటి శ్రీనిరాజు, హెచ్‌ఎస్‌బీసీ నుంచి మమత మద్దిరెడ్డి, టెక్‌ మహీంద్రా నుంచి వినయ్‌ అగర్వాల్‌, జెన్‌ప్యాక్‌ నుంచి రామ్‌కుమార్‌, సీటీఆర్‌ఎల్‌ఎస్‌ నుంచి చంద్రశేఖర్‌శర్మ తదితరులు హాజరయ్యారు.

ఉప ముఖ్యమంత్రి భట్టి మాట్లాడుతూ, ‘‘తెలంగాణలో ఎకో, ఫారెస్ట్, టెంపుల్‌ టూరిజం అభివృద్ధిలో ఐటీ సంస్థలు భాగస్వాములు కావాలి. ఐటీ ఉద్యోగులు వారాంతాల్లో కుటుంబాలతో కలిసి పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా ప్రోత్సహించాలి. ప్రాణహిత-చేవెళ్ల, కాళేశ్వరం ప్రాజెక్టులకు, కవ్వాల్, అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులకు ప్రాచుర్యం కల్పించాలి. ఫ్యూచర్‌సిటీలో ఐటీ సంస్థలు, పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలి. డిసెంబరులో జరగనున్న ఇన్వెస్ట్‌ తెలంగాణ సదస్సులో భాగంగా దేశంలోని ప్రధాన నగరాల్లో రోడ్‌షోలు నిర్వహిస్తాం’’ అని పేర్కొన్నారు.

అటవీ ప్రాంతాల్లో పర్యాటక సౌకర్యాల మెరుగుదల, ఇంటర్నెట్‌ కనెక్టివిటీ, డిజిటల్‌ వేదికల ద్వారా ప్రచారం వంటి అంశాలపై చర్చ జరిగింది. తెలంగాణలోని ఎకో టూరిజం ప్రాజెక్టులు, ప్రకృతి అందాలు, పర్యాటక ఆకర్షణల గురించి అటవీశాఖ పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించింది. అటవీ సంరక్షణ ప్రధాన అధికారి వినయ్‌ కుమార్‌, సీసీఎఫ్‌లు శరవణన్‌, ప్రియాంక వర్గీస్‌, క్షితిజ, పర్యాటకశాఖ డైరెక్టర్‌ రంజిత్‌నాయక్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Tags: