CM Revanth Reddy: జ్యూరిక్ చేరుకున్న సీఎం రేవంత్ బృందం: దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సుకు బయలుదేరనున్న సీఎం
దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సుకు బయలుదేరనున్న సీఎం
CM Revanth Reddy: ప్రపంచ ఆర్థిక సదస్సు (వరల్డ్ ఎకనామిక్ ఫోరం)లో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బృందం జ్యూరిక్ చేరుకుంది. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ విమానాశ్రయంలో సీఎంకు ప్రవాస తెలంగాణ వాసులు ఘన స్వాగతం పలికారు.
జ్యూరిక్ నుంచి రేవంత్ రెడ్డి బృందం దావోస్‌కు బయలుదేరనుంది. అక్కడ నాలుగు రోజుల పాటు జరిగే సమావేశాల్లో భాగస్వామ్యం కానుంది. వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, టాప్ సీఈఓలతో సీఎం భేటీలు జరపనున్నారు.
ఈ సందర్భంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ రోడ్‌మ్యాప్‌ను ప్రదర్శిస్తూ, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలు, ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి దిశలను వివరించనున్నారు. హైదరాబాద్‌ను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా, తెలంగాణను ఆకర్షణీయ గమ్యస్థానంగా ప్రమోట్ చేయడమే ఈ పర్యటన లక్ష్యం.
ఈ బృందంలో సీనియర్ అధికారులు, పరిశ్రమల శాఖ అధికారులు కూడా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ సదస్సు ద్వారా తెలంగాణకు కొత్త పెట్టుబడులు, ఇండస్ట్రియల్ భాగస్వామ్యాలు సాధించాలని భావిస్తున్నారు.