Kavitha: నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలోని కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్‌రెడ్డి, భారాస ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

రాష్ట్రంలో పంటలకు సాగునీరు, 24 గంటల విద్యుత్తు అందించని సీఎం రేవంత్‌రెడ్డిని రైతులే గద్దె దింపుతారని ఆమె స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు అయినా ఒక్క ప్రాజెక్ట్‌ కూడా పూర్తికాకపోవడం పాలకుల పనితీరుకు నిదర్శనమని ఆమె అన్నారు. రెండుసార్లు అధికారంలో ఉన్న భారాస రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారని విమర్శించారు.

జిల్లా రైతులు తమ పంటల్ని కాపాడుకునేందుకు శనివారం జూరాల ప్రాజెక్ట్‌ తూము వద్ద నీటిని వదులుకున్న ఘటనే కాంగ్రెస్‌ పాలనకు సజీవ ఉదాహరణగా నిలిచిందని ఆమె ధ్వజమెత్తారు.

‘ఒకరేమో నన్ను కాంగ్రెస్‌ విడిచిన బాణమని, మరొకరు కేసీఆర్‌ విడిచిన బాణమని, తలకాయ లేని మరికొందరు భాజపా విడిచిన బాణాన్నని చెబుతున్నారు. నేను బహుజనులు విడిచిన బాణాన్ని’ అని కవిత స్పష్టం చేశారు.

‘నన్ను సీఎంను చేస్తే జూరాల నుంచి రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ప్రాంతాల్లోని 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తా. లేదంటే ముక్కు నేలకు రాస్తా. యువతకు వ్యాపారం కోసం రూ.2 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు రుణాలు, జూరాల ప్రాజెక్ట్‌ నుంచి 3 టీఎంసీల నీటిని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో సాగుకు అందిస్తాం’ అని ఆమె ఉద్ఘాటించారు.

కార్యక్రమంలో కొడంగల్‌ నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి అర్చన సేనాపతి, నాయకులు రాజప్రభాకర్, బాబురావు రాథోడ్, తనుష్క తదితరులు పాల్గొన్నారు.

Tags: