Minister Ponnam Prabhakar Challenges KCR: అసెంబ్లీకి రా.. ప్రాజెక్టులపై చర్చకు సిద్ధం: కేసీఆర్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్
కేసీఆర్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్
Minister Ponnam Prabhakar Challenges KCR: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరై మాట్లాడాలని, అడ్డగోలుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. బీఆర్‌ఎస్ పాలనలో అద్దె భవనాల్లో గురుకుల పాఠశాలలు నడిపారని, కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాన్ని ప్రజలంతా చూశారని మండిపడ్డారు. ‘‘మీరు తోలు తీస్తామంటే.. ఇక్కడ ఎవరూ ఊరుకోరు’’ అంటూ పొన్నం సూటిగా ఎదురుదాడి చేశారు. తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని పొన్నం ప్రశ్నించారు. సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు తిరస్కరించారని, చేతకాగితే నిధులు తెచ్చి చూపించాలని సవాల్ విసిరారు. తమకు తెలంగాణ ప్రజలే అధికారులని, వారికే జవాబుదారీగా ఉంటామని స్పష్టం చేశారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. మహాత్మా గాంధీ పేరు రూపుమాపేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
మరోవైపు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 45 టీఎంసీలే కావాలంటూ కేంద్రానికి లేఖ రాసినందుకు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లుగా ఈ ప్రాజెక్టులో ఒక్క తట్టెడు మట్టి కూడా తవ్వలేదని విమర్శించారు. ‘‘రెండేళ్లు ఊరుకున్నాం.. ఇక ఊరుకోము. అడ్డంపడుతూ మాట్లాడితే తోలు తీస్తాం’’ అంటూ కేసీఆర్ హెచ్చరికలు జారీ చేశారు.
ఈ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ప్రాజెక్టులు, అభివృద్ధి అంశాలపై అసెంబ్లీలో బహిరంగ చర్చ జరిగే అవకాశం ఉంది.