Digital Highways: డిజిటల్ రహదారులు: తెలంగాణలో ఏఐ నిఘా వ్యవస్థ త్వరలో

తెలంగాణలో ఏఐ నిఘా వ్యవస్థ త్వరలో

Update: 2025-10-09 07:05 GMT

Digital Highways: ఏఐ సాంకేతికతతో పనిచేసే అధునాతన ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ (ఏటీఎంఎస్) త్వరలో తెలంగాణలోని పలు జాతీయ రహదారులపై అమలు కానుంది. సురక్షితమైన ప్రయాణాన్ని లక్ష్యంగా చేసుకుని, ఈ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. దిల్లీ-గురుగ్రామ్ మధ్య ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేలో ఈ టెక్నాలజీ విజయవంతమైన నేపథ్యంలో, తెలంగాణలో కూడా దీన్ని అమలు చేయాలని నిర్ణయించారు. జాతీయ రహదారుల నిఘా, ప్రమాదాల గుర్తింపు వంటి అంశాల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. పోలీసు, రవాణా శాఖలతో సమన్వయంతో ఈ డిజిటల్ హైవేలను నిర్వహిస్తారు. భవిష్యత్తులో నిర్మించే రహదారులను రాష్ట్ర కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేస్తారు.

ఆర్‌ఆర్‌ఆర్ సహా కొత్త రహదారులకు అమలు

హైదరాబాద్-విజయవాడ రహదారిని నాలుగు లేన్ల నుంచి ఆరు లేన్లుగా విస్తరించేందుకు జాతీయ రహదారుల అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే కన్సల్టెన్సీ సంస్థ డీపీఆర్ సమర్పించినందున, త్వరలో టెండర్లు ఆహ్వానించనున్నారు. ఈ విస్తరణలో ఏటీఎంఎస్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. ఎన్‌హెచ్-44 పరిధిలో నాగ్‌పుర్-హైదరాబాద్-బెంగళూరు, ఖమ్మం-దేవరపల్లి రహదారుల్లో కూడా ఈ సాంకేతికతను అమలు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కేంద్రం ఆమోదిస్తే, ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర, దక్షిణ భాగాలు పూర్తిగా ఏఐ నిఘాలో ఉంటాయి. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగానికి ఇప్పటికే టెండర్లు ఆహ్వానించారు. దీన్ని నాలుగు నుంచి ఆరు లేన్లుగా మార్చే ప్రణాళికలు సాగుతున్నాయి. భవిష్యత్తు జాతీయ రహదారుల్లోనూ ఈ టెక్నాలజీని ఉపయోగిస్తామని ఎన్‌హెచ్‌ఏఐ, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.

ప్రతి కదలికా కెమెరాలో రికార్డు

ఏటీఎంఎస్ వ్యవస్థలో ఏఐతో పనిచేసే సీసీటీవీ కెమెరాలను డిజిటల్ హైవేల్లో ఏర్పాటు చేస్తారు. 360 డిగ్రీల కోణంలో పనిచేసే ఈ కెమెరాల ద్వారా నిరంతర నిఘా సాగుతుంది. సీట్ బెల్ట్ ధరించకపోవడం, ట్రిపుల్ రైడింగ్, అధిక వేగం వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలు రికార్డు అవుతాయి. ఈ సమాచారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరుతుంది, దీంతో ఉల్లంఘనకారులకు తక్షణమే జరిమానాలు విధిస్తారు. ఇంకా, ట్రాఫిక్ పర్యవేక్షణ, వీడియో రికార్డింగ్, వాహన వేగం ట్రాకింగ్, సందేశాలతో కూడిన సైన్ బోర్డులను రోడ్ల వెంబడి ఏర్పాటు చేస్తారు. ప్రమాద వివరాలు, పొగమంచు, జంతువుల సంచారం వంటివాటిపై ఏఐ ద్వారా సమాచారం అందిస్తారు.

Tags:    

Similar News