Minister Tummala: ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో నీటి కొరత ఉందని వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. యాసంగి సీజన్‌లో తక్కువ నీటితో పండే, స్వల్పకాలిక, తక్కువ పెట్టుబడి పంటల వైపు రైతులు మళ్లాలని సూచించారు. పప్పుధాన్యాలు, నూనెగింజల సాగును ప్రోత్సహించాలని పేర్కొన్నారు.

ఈరోజు (శనివారం) సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి తుమ్మల మాట్లాడారు. రైతు నేస్తం 109వ ఎపిసోడ్‌లో రబీ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం, ఎన్‌ఎంఈఓ-ఓఎస్ పథకాల కింద విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఆయా ప్రాజెక్టుల్లో నీటి నిల్వల ఆధారంగా సాగునీటి ప్రణాళిక రచిస్తున్నట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో నీటి పారుదల ప్రణాళిక అమలు చేయాలని సూచించారు.

మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలు ఎంచుకోవాలని, వేరుశనగలో నూతన విత్తన రకాలు అభివృద్ధి చేయాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. ఇతర పంటలకు స్ప్రింక్లర్లను సబ్సిడీపై అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఆయిల్‌పామ్ గెలలను వేగంగా ఫ్యాక్టరీలకు తరలించేలా చూస్తామని, అన్నదాతలకు చెల్లింపులు త్వరితగతిన జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

నూనెగింజల విత్తనాల కోసం రూ.49.35 కోట్లు కేటాయించినట్లు, ఇప్పటికే రూ.34.55 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. 52,425 ఎకరాలకు 29,375 క్వింటాళ్ల విత్తనాలు ధ్రువీకరించినట్లు చెప్పారు. రూ.36.76 కోట్ల సబ్సిడీతో వేరుశనగ, కుసుమ, పొద్దుతిరుగుడు, నువ్వుల విత్తనాలు పంపిణీ చేస్తామని అన్నారు.

పప్పుధాన్యాల కోసం రూ.34.60 కోట్లు కేటాయించి, 21 జిల్లాల్లో 29,008 క్వింటాళ్ల శనగ, మినుము, పెసర విత్తనాలు సబ్సిడీపై పంపిణీ చేస్తామని వెల్లడించారు. విత్తనాలపై 50 నుంచి 75 శాతం వరకు సబ్సిడీ, కొన్ని రకాలకు వందశాతం సబ్సిడీ అందిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. మొత్తంగా విత్తన సబ్సిడీకి రూ.52 కోట్లకు పైగా నిధులు వెచ్చిస్తున్నట్లు తెలిపారు.

Tags: