Former Vice President Venkaiah Naidu: 2047లోపు వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
Former Vice President Venkaiah Naidu: దేశ ప్రజలందరికీ అలాయ్ బలాయ్, విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, 2047 నాటికి భారతదేశాన్ని వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దాలని బలమైన పిలుపునిచ్చారు. ఆకలి, దప్పిక లేని, అవినీతి, అఘాయిత్యాలకు తావులేని సమాజ నిర్మాణం కోసం ప్రతి పౌరుడూ కృషి చేయాలని ఆయన అభ్యర్థించారు.
గతంలో భారతీయుల మధ్య ఉన్న విభేదాలను బ్రిటిష్ పాలకులు తమకు అనుకూలంగా మలుచుకుని దేశాన్ని పాలించారని, ఆ క్రమంలో మన సంస్కృతి, సంప్రదాయాలను దెబ్బతీశారని వెంకయ్య నాయుడు గుర్తుచేశారు. అందుకే ప్రజల మధ్య ఐక్యత, పరస్పర గౌరవం, సోదరభావం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. మనుషుల మధ్య ప్రేమను పంచుతూ, ఆత్మీయ అనుబంధాలను బలోపేతం చేసే గొప్ప వేదికగా అలాయ్ బలాయ్ను వర్ణించారు. మానవత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ఇలాంటి కార్యక్రమాల ద్వారా మన మధ్య ఉన్న అనుబంధాలను ఇతరులతో పంచుకోవాలని సూచించారు.
దేశానికి, సమాజానికి అన్నింటికంటే ముఖ్యమైనది ఐక్యతే అని నొక్కి చెప్పిన వెంకయ్య నాయుడు, భారతీయులందరూ భిన్నత్వాన్ని గౌరవిస్తూ సమైక్యంగా ఉండాలని, ప్రకృతితో మమేకమై జీవించే అలవాటును పెంపొందించుకోవాలని కోరారు. దేశాభివృద్ధితో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలు, భాషలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ముఖ్యంగా మాతృభాష తెలుగును పరిరక్షించాలని పిలుపునిచ్చారు. మాతృభాష మన కంటి చూపు లాంటిదని, దానిని నిర్లక్ష్యం చేయకుండా భావి తరాలకు అందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడంతో పాటు మన సంప్రదాయాల గొప్పతనాన్ని చాటి చెప్పాలని అన్నారు. పరస్పర కలహాలకు దూరంగా ఉంటూ ప్రేమ, ఆప్యాయత, మానవత్వంతో ముందుకు సాగినప్పుడే అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణం సాధ్యమవుతుందని మాజీ ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.