GHMC:మూడు కార్పొరేషన్ల ఏర్పాటు ఖాయం.. అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Update: 2025-12-31 06:21 GMT

GHMC: గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు ప్రత్యేక నగరపాలక సంస్థలుగా విభజించే ప్రక్రియ ఫిబ్రవరి మూడో వారంలో పూర్తవనున్నది. జీహెచ్‌ఎంసీ, జీసీఎంసీ (గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్), జీఎంఎంసీ (గ్రేటర్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్) పేర్లతో ఈ మూడు సంస్థలు ఆవిర్భవించనున్నాయి.

ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పాలకమండలి పదవీకాలం ఫిబ్రవరి 10తో ముగియనుండటంతో, ఈ విభజన ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయింది. అయితే, మంగళవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పరోక్ష సంకేతాలిచ్చారు. పాలకమండలి గడువు ముగిసిన వెంటనే మూడు కొత్త మహానగరపాలక సంస్థలు ఏర్పడతాయని స్పష్టమైన సూచనలు చేశారు.

విభజన వివరాల ప్రకారం:

మూసీ నదికి దక్షిణ దిశలోని నాలుగు జోన్లు, సికింద్రాబాద్, గోల్కొండ జోన్లతో కూడిన ప్రాంతాలు జీహెచ్‌ఎంసీగా కొనసాగుతాయి. ఇందులో మొత్తం 150 డివిజన్లు ఉంటాయి.

కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లు గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీసీఎంసీ)గా ఏర్పడతాయి.

మల్కాజిగిరి, ఎల్బీనగర్, ఉప్పల్ జోన్లు గ్రేటర్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (జీఎంఎంసీ)గా మారతాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పోలీస్ కమిషనరేట్లను కూడా పునర్వ్యవస్థీకరించింది. కూకట్‌పల్లి సహా మూడు జోన్లకు సృజనను, మల్కాజిగిరి సహా మూడు జోన్లకు వినయ్ కృష్ణారెడ్డిని అదనపు కమిషనర్లుగా నియమించింది. వీరు ప్రస్తుత కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆధ్వర్యంలో కొత్త సంస్థలు ఏర్పడే వరకు పరిపాలనను పర్యవేక్షిస్తారు.

మొదట మూసీ అవతల ప్రాంతాలను మాత్రమే జీహెచ్‌ఎంసీలో ఉంచాలని ప్రభుత్వం ఆలోచించింది. కానీ ఆదాయ నష్టం, రాజకీయ సమస్యలు రావొచ్చనే అంశాలు చర్చలోకి రావడంతో స్వల్ప మార్పులతో తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News