Kavitha: జీవోలు 33, 150తో తెలంగాణ వైద్య విద్యార్థులకు తీవ్ర నష్టం.. రద్దు చేయాలంటూ కల్వకుంట్ల కవిత హెచ్చరిక
కల్వకుంట్ల కవిత హెచ్చరిక
Kavitha: మెడికల్ సీట్లలో స్థానికత నిబంధనలను మార్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 33, 150 కారణంగా తెలంగాణ వైద్య విద్యార్థులకు పెను ప్రమాదం పొంచి ఉందని తెలంగాణ రక్షణ సేన చీఫ్, టీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. ఈ జీవోలతో రాష్ట్ర విద్యార్థులకు నష్టం జరుగుతుందని, ఇతర రాష్ట్రాల విద్యార్థులకు మేలు కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
సోమవారం వీడియో సందేశం విడుదల చేసిన కవిత, తెలంగాణకు నష్టం చేసే ఈ జీవోలను రద్దు చేయకపోగా సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ దాన్ని డిఫెండ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే ఈ జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమం స్థానిక ప్రజలకు అన్ని రంగాల్లో సర్వ హక్కుల కోసమే అని గుర్తు చేస్తూ, కాంగ్రెస్ సర్కార్ ఆ హక్కులనే హరించేలా జీవోలు తెస్తోందని మండిపడ్డారు.
1 నుంచి 7వ తరగతి వరకు చదివిన వారిని స్థానికులుగా భావించకుండా 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలో చదివిన వారికే స్థానిక హోదా ఇవ్వడం ఏమిటని నిలదీశారు. దీని కారణంగా తమ పిల్లలు నష్టపోతున్నారని ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మెడికల్ సీట్లలో తీసుకొచ్చిన ఈ స్థానికత విధానాన్ని భవిష్యత్తులో అన్ని రంగాల్లో అమలు చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. అలా జరిగితే తెలంగాణ యువత పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తెచ్చిన జీవోలు తెలంగాణకు విపత్తు లాంటివని హెచ్చరించిన కవిత, దీనిపై తెలంగాణ సమాజమంతా ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో జేఏసీ చైర్మన్‌గా ఉన్న ప్రొఫెసర్ కోదండరాం ఈ అంశంపై గళమెత్తాలని, విద్యార్థులకు జరిగే నష్టాన్ని ప్రభుత్వానికి వివరించాలని కోరారు. తెలంగాణ మేధావి వర్గం, యువత, విద్యార్థులు అంతా ఈ జీవోలను వ్యతిరేకించాలన్నారు.
ఇప్పటికే గ్రూప్-1లో స్థానికత అంశం కారణంగా తెలంగాణ విద్యార్థులు ఎంతో నష్టపోయారని గుర్తు చేసిన కవిత, తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరిగే విధంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికైనా బుద్ధి మార్చుకోవాలని సూచించారు. లేదంటే తెలంగాణ ప్రజలు సరైన సమయంలో కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని హెచ్చరించారు.