Hyderabad-Born Ghazala Hashmi Creates History: హైదరాబాద్‌లో జన్మించిన గజాలా హష్మీ.. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా చరిత్ర: మొదటి ఇండియన్-అమెరికన్ ముస్లిం మహిళ!

వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా చరిత్ర: మొదటి ఇండియన్-అమెరికన్ ముస్లిం మహిళ!

Update: 2025-11-06 04:30 GMT

Hyderabad-Born Ghazala Hashmi Creates History: 2017లో డొనాల్డ్ ట్రంప్ ముస్లిం దేశాలపై విధించిన ప్రయాణ నిషేధాలు గజాలా హష్మీలో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. అమెరికాలో సమానత్వం, సమ్మిళితత్వం కోసం పోరాడాలని ఆమె నిర్ణయించుకుని రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇప్పుడు, అదే ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, గజాలా వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఘన విజయం సాధించి చరిత్రను సృష్టించారు. మొదటి ఇండియన్-అమెరికన్, సౌత్ ఏషియన్ అమెరికన్, ముస్లిం మహిళగా ఈ పదవిని ఆక్రమించిన ఆమె, డెమొక్రటిక్ పార్టీ కొత్త తరం నాయకత్వానికి చిహ్నంగా మారారు. మార్పు దిశగా సాగుతున్న వర్జీనియాలో ఆమె ప్రవేశం.. మన హైదరాబాద్‌లోని బాల్య కథలతోనే ప్రారంభమైంది!

తల్లిదండ్రుల స్ఫూర్తితో రాజకీయ ప్రయాణం..

1964 జనవరి 17న హైదరాబాద్‌లో జన్మించిన గజాలా, మల్కపేటలోని అమ్మమ్మ ఇంట్లో బాల్యాన్ని గడిపారు. తాత రాష్ట్ర ఆర్థిక శాఖలో ఉద్యోగి. తండ్రి జియా హష్మీ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఎంఏ, ఎల్‌ఎల్‌బి చేసి, సౌత్ కరోలినా యూనివర్సిటీలో అంతర్జాతీయ సంబంధాల్లో పిహెచ్‌డి పూర్తి చేశారు. ప్రొఫెసర్‌గా, 'సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్' స్థాపకుడిగా పేరు తెచ్చుకున్నారు. తల్లి తన్వీర్ హష్మీ కోఠీ ఉమెన్స్ కాలేజీలో చదువుతూ బీఏ, బీఈడీ పూర్తి చేశారు. నాలుగేళ్ల వయసులో తల్లిదండ్రులు, అన్నలతో అమెరికాకు వలస వెళ్ళిన గజాలా, తల్లిదండ్రుల స్ఫూర్తితో బోధనా వృత్తిని ఎంచుకున్నారు. హైస్కూల్‌లోనే ఉపకారవేతనాలు, ఫెలోషిప్‌లు అందుకున్నారు. జార్జియా సదరన్ యూనివర్సిటీలో బీఏ ఆనర్స్, ఎమోరీ యూనివర్సిటీలో అమెరికన్ సాహిత్యంలో పిహెచ్‌డి పూర్తి చేశారు.

ప్రొఫెసర్ నుంచి రాజకీయ నాయకురాలుగా..

అజహార్ రఫీతో వివాహం తర్వాత రిచ్మాండ్‌లో స్థిరపడిన గజాలా, యాస్మిన్, నూర్ అనే ఇద్దరు కుమార్తెలకు తల్లయ్యారు. యూనివర్సిటీ ఆఫ్ రిచ్మాండ్‌లో ప్రొఫెసర్‌గా వృత్తి ప్రారంభించి, రెనాల్డ్స్ కమ్యూనిటీ కాలేజీలో 'సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ టీచింగ్ అండ్ లెర్నింగ్' వ్యవస్థాపకురాలిగా మారారు. ముప్పయి ఏళ్ల పాటు బోధనా వృత్తిలో కొనసాగిన ఆమె, 2019లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రిపబ్లికన్ ప్రాబల్యం ఉన్న స్టేట్ సెనేట్ సీటులో సంచలన విజయం సాధించి, 2023లో మరోసారి గెలిచారు. 2024లో 'సెనేట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కమిటీ' చైర్‌పర్సన్‌గా ఎంపికయ్యారు. 'రైట్ టు వర్క్' చట్టాలకు మద్దతు, విద్య-ఆరోగ్య బిల్లుల ప్రవేశపెట్టడంతో ప్రజల విశ్వాసాన్ని సంపాదించారు.

విజయ వాగ్దానాలు..

లెఫ్టినెంట్ గవర్నర్ పదవికోసం పోటీపడిన గజాలా, గృహ నిర్మాణం, విద్య, ఆరోగ్యంలో అసమానతలను తొలగించడం, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం వంటి వాగ్దానాలు చేశారు. పౌరుల జీవితాలను మెరుగుపరచడానికి అంకితమవుతానని ప్రకటించారు. రిపబ్లికన్ అభ్యర్థి జాన్ రీడ్‌పై ఘన విజయం సాధించిన ఆమె, గెలుపు తర్వాత మాట్లాడుతూ.. "ప్రజలను అధోగతి పట్టించేవారిని కాకుండా, వారి అభ్యున్నతికి పాటుపడే నాయకత్వాన్ని వర్జీనియా ఎంచుకుంది. మన వైవిధ్యమే మన గొప్ప శక్తి. భవిష్యత్ పట్ల దార్శనికత, విశ్వాసం ఉంచిన ఓటర్లకు ధన్యవాదాలు" అని అన్నారు. హైదరాబాద్‌లో జన్మించిన ఈ మహిళ చరిత్రను మలిచిన ఘనత మన తెలుగు గర్వాన్ని మరింత పెంచారు!

Tags:    

Similar News