Kavitha: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం నిజామాబాద్‌లో నిర్వహించిన పాంచజన్య సభలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తాను ఏ తప్పూ చేయకుండానే తిహాడ్‌ జైలులో పెట్టారని, తండ్రిని బిడ్డను వేరుచేయడంలో ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి మొదటి పాత్ర పోషించారని ఆయనను దుయ్యబట్టారు. ఆయన శకుని పాత్ర పోషించినట్లు ఆరోపించారు. మాట్లాడుతూ కంటతడి పెట్టారు.

“హరీశ్‌రావునో, సంతోష్‌రావునో క్షమిస్తానేమో గానీ.. ప్రశాంత్‌రెడ్డిని మాత్రం క్షమించను. ఆయనకు నా ఉసురు తగులుతుంది. ప్రశాంత్‌రెడ్డిని కేసీఆర్‌ కుమారుడిలా చూసుకుంటే.. ఆయన మా మధ్య చిచ్చుపెట్టారు. కేసీఆర్‌ ప్రభుత్వం దిగిన రెండో రోజే ఆయన కాంగ్రెస్‌ పార్టీతో మాట్లాడారు. ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. నెల రోజులు అమెరికాలో ఉండి వేం నరేందర్‌రెడ్డితో సంప్రదింపులు చేశారు” అని కవిత అన్నారు.

“ప్రశాంత్‌రెడ్డికి ప్రజా జీవితం లేదు. ఆయన బాల్కొండ నుంచి పారిపోవాలి. ప్రశాంత్‌రెడ్డి వైఖరి పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లుగా ఉంది. ఆయన మంత్రి కావడానికి నేను ఎంతో ప్రయత్నం చేశా. ప్రశాంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి, ఆనాటి బోధన్‌ ఎమ్మెల్యేను గెలిపించడానికి ఎంతో కష్టపడ్డాను. అయితే వారందరూ నన్ను పరాజితురాలిని చేశారు. నేను ఏం తప్పు చేశానని తిహాడ్‌ జైలులో పెట్టారు? నిజామాబాద్‌ జిల్లా కోడలిగా ఉద్యమం చేసిన నన్ను నాలుగేళ్లు ఈడీ, సీబీఐ వేధింపులకు గురిచేశాయి. చివరకు నేను ఏ తప్పు చేయలేదని తేలింది. నన్ను ఎందుకోసం పార్టీ నుంచి బహిష్కరించారు? తెలంగాణ రక్షణ సేన.. పదవుల కోసం పెట్టిన పార్టీ కాదు. కన్నీళ్లు పెట్టుకున్నానని నేను పిరికిదాన్ని అనుకోవద్దు” అని కవిత స్పష్టం చేశారు.

Tags: