Indiramma Insurance Scheme: తెలంగాణ రాష్ట్రంలోని కోటికిపైగా పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కొత్తగా ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం కింద ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కవరేజీ అందుతుంది.

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే అమలులో ఉన్న రూ.2 లక్షల జీవిత బీమాను రూ.5 లక్షలకు పెంచారు. ప్రమాద బీమా మాత్రం రూ.10 లక్షలుగా యథాతథంగా కొనసాగుతుంది. రాష్ట్రంలో వివిధ శాఖల ద్వారా నడుస్తున్న అన్ని ప్రభుత్వ బీమా పథకాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి అమలు చేయనున్నారు.

పథకం అమలు కోసం మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, హైదరాబాద్, మల్కాజ్‌గిరి, సైబరాబాద్ మహానగర పాలక సంస్థల కమిషనర్లకు వివరమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రతి కుటుంబంలో 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు గల సంపాదించే ఒక వ్యక్తిని మాత్రమే నమోదు చేయాలి. ఎవరిని నమోదు చేయాలనేది కుటుంబ సభ్యులు నిర్ణయించుకోవాలి. ఆ వ్యక్తి మరణిస్తే కుటుంబానికి రూ.5 లక్షలు అందిస్తారు.

దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 19 నుంచి ప్రారంభమై డిసెంబరు 18 వరకు కొనసాగుతుంది. నమోదు సమయంలోనే నామినీ వివరాలు సేకరిస్తారు. ఒకరికంటే ఎక్కువ మంది నామినీలు ఉంటే వాటా వివరాలు కూడా స్పష్టంగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు.

గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాల్లో వార్డు అధికారులు శిబిరాలకు ఇన్‌ఛార్జ్‌గా ఉంటారు. రేషన్ కార్డు డేటా ఆధారంగా నమోదు జరుగుతుంది. రేషన్ కార్డు లేని వారికి ప్రత్యేక ఫారాలు అందుబాటులో ఉంచుతారు. గ్రామస్థాయిలోనే దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచాలని సీఎం స్పష్టం చేశారు.

పథకం ప్రారంభోత్సవం నవంబరు 19న సిద్ధిపేటలో జరగనుంది. అక్కడే ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా సీఎం లాంఛనంగా ప్రారంభించనున్నారు. అర్హులైన ప్రతి పేద మహిళకు ఉచితంగా చీరలు అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

క్లెయిమ్‌లు వారం రోజుల్లోనే పరిష్కారం కావాలని, పారదర్శకంగా ఉండాలని సీఎం సూచించారు. ఈ పథకం గ్రామీణ ఉపాధి హామీ కూలీలు, రోజువారీ వేతనాలపై ఆధారపడి జీవించే లక్షలాది కుటుంబాలకు పెను ఆసరాగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు.

ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో హెల్ప్‌డెస్క్, జిల్లాల్లో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. ప్రజలు సులభంగా నమోదు చేసుకునేలా విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్లకు సూచించారు.

ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ఒక శాశ్వత ఆర్థిక రక్షణ లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Tags: