Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: ఓటుకు రూ.3 వేలు.. పార్టీలు ముందే డబ్బు పంపిణీ షురూ!
పార్టీలు ముందే డబ్బు పంపిణీ షురూ!
ఒక పార్టీ రూ.2 వేలు హామీ.. మరో పార్టీ రూ.వెయ్యి పెంచి రూ.3 వేలు ఆఫర్!
ప్రచారం ముగియకముందే బూత్‌ల వారీగా ఓటర్లకు నగదు చేరుస్తున్నారు
యూపీఐ పేమెంట్లు, ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్లతో కొత్త ట్రెండ్.. నియోజకవర్గంలో హీటెక్కిన రాజకీయ జ్వరం
Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు జోరుగా సాగుతోంది. ప్రచార పర్వం ఇంకా ముగియకముందే ప్రధాన పార్టీలు బూత్‌ల వారీగా ఓటర్లకు నగదు పంపిణీ మొదలుపెట్టాయి. ఒక ప్రధాన పార్టీ ఓటుకు రూ.3 వేల చొప్పున ఇస్తూ సంచలనం సృష్టిస్తోంది. మొదట రూ.2 వేలు హామీ ఇచ్చిన మరో పార్టీని టార్గెట్ చేస్తూ.. రూ.వెయ్యి అదనంగా ఆఫర్ చేస్తూ ఈ పార్టీ ముందుకు వచ్చింది. సాధారణంగా ఎన్నికల తర్వాత రాత్రి గుట్టుచప్పుడు కాకుండా డబ్బు-మందు పంచేవారు.. ఈసారి మాత్రం పోలీసు తనిఖీల భయంతో ప్రచారం సాగుతుండగానే ఓట్లు కొనుగోలు చేస్తున్నారు.
పోలీసుల సోదాలు, ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్‌ల ఆంక్షలు ఉన్నప్పటికీ.. పార్టీలు అప్రమత్తమయ్యాయి. ప్రచారం ముగిశాక డబ్బు పంపిణీకి అవరోధాలు ఎదురవుతాయని భావించి ముందుగానే యంత్రాంగాన్ని సిద్ధం చేశాయి. బూత్‌ల వారీగా ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశాయి. స్థానిక కార్యకర్తలతో పాటు జిల్లాల నుంచి తెచ్చిన వాలంటీర్లను ఇన్‌చార్జులుగా నియమించాయి. అపార్ట్‌మెంట్లు, బస్తీలు, వీధుల వారీగా ఓటర్ల లిస్ట్ సేకరించి.. నేరుగా ఇళ్లకు వెళ్లి నగదు పంచుతున్నారు. కొందరు యూపీఐ ద్వారా ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ చేస్తూ.. ఆధారాలు లేకుండా సాగిస్తున్నారు.
యూసుఫ్‌గూడ బస్తీలో రూ.12 వేలు.. రూ.6 వేలు!
యూసుఫ్‌గూడలోని ఓ నాలుగంతస్తుల భవనంలో నాలుగు కుటుంబాలు నివాసముంటున్నాయి. అందులో రెండు కుటుంబాలకు మాత్రమే ఓట్లు ఉన్నాయి. రెండు రోజుల క్రితం ఒక ప్రధాన పార్టీ బూత్ ఇన్‌చార్జి వచ్చి.. ఓటుకు రూ.2 వేల చొప్పున పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఇస్తామని హామీ ఇచ్చారు. యూపీఐ పేమెంట్‌కు ఫోన్ నంబర్లు కూడా తీసుకున్నారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం మరో ప్రధాన పార్టీ ఇన్‌చార్జి వచ్చి.. ఒక్కో ఓటుకు రూ.3 వేలు ఇస్తూ నేరుగా నగదు పంచారు. ఒక కుటుంబంలో నలుగురు ఓటర్లు ఉండగా రూ.12 వేలు, మరో కుటుంబంలో ఇద్దరు ఉండగా రూ.6 వేలు చెల్లించారు. తమ పార్టీకే ఓటు వేయాలని హామీ తీసుకున్నారు.
ఇదే పార్టీ మరో బూత్ కమిటీ.. రహమత్‌నగర్ డివిజన్‌లోని బస్తీలో ఓటుకు రూ.2500 చొప్పున పంచినట్లు సమాచారం. దీంతో మొదట రూ.2 వేలు హామీ ఇచ్చిన పార్టీ నేతలు ఇప్పుడు రేటు పెంచుతారా? లేక రూ.2 వేలతోనే సరిపెట్టుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది. రూ.2 వేలు ఆఫర్‌తో మొగ్గుచూపిన ఓటర్లు.. ఇప్పుడు రూ.3 వేలు వస్తోందని పునరాలోచనలో పడ్డారు. మొత్తంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్ల కొనుగోలు యుద్ధం హోరెత్తించింది!