Kavitha’s Allegation: కవిత ధ్వజం: భారాసకు నైతికత లేదు.. ఆత్మగౌరవ యుద్ధమిది!

ఆత్మగౌరవ యుద్ధమిది!

Update: 2026-01-06 11:05 GMT

సభలో కన్నీటి ప్రసంగం.. ‘తెలంగాణ జాగృతి’ని రాజకీయ పార్టీగా మారుస్తానని ప్రకటన

Kavitha’s Allegation: భారత రాష్ట్ర సమితి (భారాస)లో నైతికత లేదని, ఆ పార్టీ రాజ్యాంగం పెద్ద జోక్‌లా ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. శాసనమండలిలో సోమవారం భావోద్వేగంతో మాట్లాడిన ఆమె.. తనను సస్పెండ్ చేయడం రాత్రికి రాత్రి క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేసి చేసిన అన్యాయమని ఆరోపించారు. ‘‘నాది ఆస్తుల పంచాయితీ కాదు.. ఆత్మగౌరవ పోరాటం. మా కులదైవం లక్ష్మీనరసింహస్వామి, నా కుమారులపై ప్రమాణం చేసి చెబుతున్నా.. ఇక్కడి నుంచి వ్యక్తిగా వెళ్తున్నా.. రాజకీయ శక్తిగా మళ్లీ చట్టసభలకు వస్తా. వచ్చే ఎన్నికల నాటికి ‘తెలంగాణ జాగృతి’ రాజకీయ పార్టీగా ఎదుగుతుంది’’ అని ప్రకటించారు.

కవిత మాట్లాడుతూ కంటతడి పెట్టారు. పార్టీలోని అవినీతి, దుర్మార్గాలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటులో తాను కీలక పాత్ర పోషించానని, అయినా పార్టీ నుంచి ఆంక్షలు ఎదురయ్యాయని గుర్తు చేశారు. ధర్నాచౌక్ తొలగింపు, రైతుల అరెస్టులు, కలెక్టరేట్ల నిర్మాణం, ఇసుక దందాల్లో అవినీతి జరిగిందని.. సిద్దిపేట, సిరిసిల్ల కలెక్టరేట్లు ఒక్క వర్షానికే కూలిపోయాయని ఉదాహరణలిచ్చారు.

తెరాసను భారాసగా మార్చడాన్ని తాను ఎప్పుడూ ఒప్పుకోలేదని, తెలంగాణ సాధించాక జాతీయ పార్టీగా మారడం సరికాదని అన్నారు. భాజపా తెలంగాణను మోసం చేసిందని, ఒక్క జాతీయ ప్రాజెక్టు కూడా ఇవ్వలేదని విమర్శించారు. తనపై ఈడీ, సీబీఐ కేసుల్లో ఒంటరిగా పోరాడానని.. పార్టీ నుంచి మద్దతు లభ్యం కాలేదని ఆరోపించారు. హరీశ్‌రావు పేరు చెప్పిన కొన్ని గంటల్లోనే తనను సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతరం గన్‌పార్కు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన కవిత.. తన రాజీనామాను ఆమోదించాలని మండలి ఛైర్మన్‌ను కోరారు. భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయమని ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పునరాలోచన సూచించినా.. కవిత తన నిర్ణయంపై పట్టుబట్టారు.

Tags:    

Similar News