Minister Jupally Krishna Rao Slams: కేసీఆర్ నీటి హక్కుల్లో విఫలం: అంతా నాటకమే అంటూ ధ్వజమెత్తిన మంత్రి జూపల్లి కృష్ణారావు
అంతా నాటకమే అంటూ ధ్వజమెత్తిన మంత్రి జూపల్లి కృష్ణారావు
Minister Jupally Krishna Rao Slams: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రెండేళ్ల తర్వాత బయటకు వచ్చి అధికారంలోకి వస్తానని, తోలు తీస్తానని మాటలు చెబుతున్నారని, కానీ ఆ పార్టీకి ఇప్పుడు కండలు కరిగిపోయి తోలు మాత్రమే మిగిలి ఉందని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎద్దేవా చేశారు. పార్టీ బలహీనపడటం, ప్రతిష్ఠ కాపాడుకోవాల్సిన అవసరం కేసీఆర్‌కు అర్థమైందని ఆయన వ్యాఖ్యానించారు. గాంధీ భవన్‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరితో కలిసి జూపల్లి మీడియాతో మాట్లాడారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సమస్య కంటే పార్టీ ప్రతిష్ఠను కాపాడుకోవడమే కేసీఆర్ బయటకు రావడానికి ముఖ్య కారణమని జూపల్లి అన్నారు. గతంలో ఆ ప్రాజెక్టు వద్ద కుర్చీ వేసుకుని పూర్తి చేస్తానని చెప్పిన కేసీఆర్, పదేళ్ల పాలనలో రూ.8 లక్షల కోట్ల అప్పు చేసినా ఒక్క ఎకరాకు నీళ్లు అందించలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రధాన కాలువలు కూడా పూర్తి కాలేదని, 2023 ఎన్నికల సమయంలో నీటి కేటాయింపులు, అనుమతులు లేకుండానే ఒక మోటారు ఆన్ చేసి జాతికి అంకితమిచ్చారని ఆరోపించారు.
ఈ ప్రాజెక్టు పూర్తికి ఇంకా రూ.40 నుంచి రూ.50 వేల కోట్లు అవసరమని, పర్యావరణ అనుమతులు తీసుకుంటేనే మన నీళ్లు మనం వినియోగించుకునే అవకాశం ఉంటుందని జూపల్లి తెలిపారు. సాగునీటికి కాదని, తాగునీటి అవసరాలకే అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి పనులు ప్రారంభించవచ్చని కోర్టు అనుమతి ఇచ్చిందని గుర్తుచేశారు. విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలకు కలిపి 811 టీఎంసీలు కేటాయింపు ఉండగా, నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా నీటి విభజన జరగాలని, కానీ బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణకు 299 టీఎంసీలే చాలని, మిగతా 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్‌కు వదిలేశారని ఆయన మండిపడ్డారు.
బీఆర్‌ఎస్-భాజపా కుమ్మక్కు: జూపల్లి ఆరోపణ
పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, భాజపా రెండూ కలిసి పనిచేశాయని జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ఆ రెండు పార్టీలు కలిసినా మూడింట ఒక వంతు సీట్లు కూడా రాలేదని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను రెండేళ్ల కాంగ్రెస్ పాలనకు రిఫరెండమ్‌గా చెప్పిన కేటీఆర్ వ్యాఖ్యలను గుర్తుచేస్తూ, కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు చేసిన ఆరోపణలు తప్పని ప్రజలు తమ తీర్పుతో నిరూపించారని జూపల్లి అన్నారు.