KTR: కేటీఆర్: రేవంత్ మూడేళ్లు ఉంటారా.. మూణ్నెల్లు కూడా ఉండరా?

మూణ్నెల్లు కూడా ఉండరా?

Update: 2025-11-10 16:25 GMT

KTR: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటర్లు దిమ్మతిరిగే తీర్పు ఇస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడేళ్లు వుంటారో.. మూణ్నెల్లు వుంటారో అని తేలిపోతుందని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. ఒక్క సీటు కోసం సీఎం  ప్రచారం చేస్తున్నారంటే.. కాంగ్రెస్ శ్రేణుల్లో ఎంత భయం ఉందో అర్థమవుతుందని ఆయన విమర్శించారు. దిల్లీలో రేవంత్‌పై నల్గొండ, ఖమ్మం నేతలు కత్తులు నూరుతున్నారని, సీఎం కుర్సీకి కొందరు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ పేర్కొన్నారు.

ప్రచార గడువు చివరి రోజు ఆదివారం సాయంత్రం యూసుఫ్‌గూడ డివిజన్‌లోని శ్రీకృష్ణానగర్‌లో జరిగిన రోడ్‌షోలో కేటీఆర్ మాట్లాడారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించితే.. 500 రోజుల్లోనే కేసీఆర్ ప్రభుత్వం తిరిగి వస్తుందని, అందర్నీ ‘కడుపులో పెట్టుకుని’ చూసుకునే బాధ్యత తమదని ఆయన ప్రకటించారు. ‘‘ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి తీయని మాటలు చెప్పి.. తర్వాత పైసలు లేవని చేతులెత్తేస్తారు. ఆరు గ్యారంటీలతో అన్ని వర్గాలను మోసం చేసిన వాడు జూబ్లీహిల్స్‌కు న్యాయం చేస్తాడా? రెండేళ్ల క్రితం ఒక్కసారి మోసపోయాము.. ఇప్పటికీ అవస్థలు పడుతున్నాం’’ అని కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

కాంగ్రెస్ దొంగలు.. ముస్లింలకు బెదిరింపులు

కాంగ్రెస్ ఓడిపోతుందని తెలిసి కూడా ఓట్ల కోసం డబ్బులు పంచుతోందని, పోలింగ్ రోజు ప్రజలు బయటికి రాకపోతే దొంగల ఓట్లు వేస్తారని ఆరోపించారు. యూసుఫ్‌గూడలో ముస్లిం ప్రజలకు రేవంత్ బెదిరింపులు ఇస్తున్నారని, ముస్లిం సోదరులు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని సూచించారు. ‘‘రేవంత్ రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్ మనిషి.. గాంధీభవన్‌ను మోహన్ భాగవత్ నడుపుతున్నారని అసదుద్దీన్ ఒవైస్ చెప్పేవారు. ఇప్పుడు ఎందుకు మారిపోయారు? కాంగ్రెస్ ఏమిచ్చింది? బుల్డోజర్‌ను ఆపాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలి. కత్తి మాకు ఇవ్వండి.. బుల్డోజర్‌కు అడ్డంగా నిలబడి ఆపే బాధ్యత మా ది’’ అని కేటీఆర్ ప్రశ్నించారు.

కేసీఆర్ పదేళ్లు.. రేవంత్ రెండేళ్లు.. ఆలోచించి ఓటు

‘‘కేసీఆర్ పదేళ్ల పాలన.. రేవంత్ రెండేళ్ల పాలనను చూసి ఆలోచించి ఓటు వేయాలి. బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే.. ఆడబిడ్డలకు రూ.2,500, వృద్ధులకు రూ.4,000 పింఛను, దివ్యాంగులకు రూ.6,000 పింఛను అమలవుతాయి. జూబ్లీహిల్స్‌లోని 4 లక్షల ఓటర్లకు.. రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజలకు న్యాయం చేసే అవకాశం దక్చింది’’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో యూసుఫ్‌గూడలో రూ.12 కోట్లతో డ్రైనేజీ పనులు ప్రారంభించి, రూ.2 కోట్ల పనులు పూర్తి చేశామని గుర్తు చేశారు. మిగిలిన పనులు సునీత గెలిచాక చేయించే బాధ్యత తనదని, ఆమె గెలుపుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. రోడ్‌షోలో భారీగా కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Tags:    

Similar News