Mahesh Kumar Goud: సీఎంతో గొడవలేవన్న మహేశ్‌కుమార్ గౌడ్.. పార్టీలో భిన్నాభిప్రాయాలు సహజమే
భిన్నాభిప్రాయాలు సహజమే
Mahesh Kumar Goud: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మంగళవారం మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రెండేళ్ల ప్రయాణం ఎంతో ఉత్సాహంగా సాగిందని, బూత్ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేశామని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యమని అన్నారు.
కుల సర్వేతో తెలంగాణలో నిజమైన సామాజిక న్యాయం జరిగిందని, దీన్ని కేంద్రం తొక్కిపెట్టడం దురదృష్టకరమని మహేశ్‌కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కుల సర్వేను అమలు చేస్తామని తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డితో తనకు ఎక్కడా గొడవ జరగలేదని స్పష్టం చేశారు. ‘‘పార్టీలో భిన్నాభిప్రాయాలు సహజమే. మా మధ్య గ్యాప్ ఉందని, గొడవ జరిగిందని ప్రచారం జరుగుతోంది. అలాంటివి ఏమీ లేవు. సీఎంతో అభిప్రాయ భేదాలు వచ్చినా సాయంత్రానికే సరిచేసుకున్నాం. పార్టీ విషయంలో సీఎం ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు’’ అని అన్నారు.
బీసీ మంత్రిని తొలగించినప్పుడు తాను కూడా బాధపడ్డానని, ఏఐసీసీ నిర్ణయం మేరకే సురేఖపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. క్రమశిక్షణ తప్పితే ఎవరిపైనా చర్యలు తప్పవని, క్రమశిక్షణ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఏఐసీసీ నిర్ణయించిందని మహేశ్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు