CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అడుగుపెట్టారు. భారతీయ జనతా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రులతో కలిసి సీఎం నేతృత్వంలో నిర్వహించిన పాదయాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

అంబేడ్కర్ చౌక్ నుంచి బహిరంగ సభాస్థలి వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర 40 నిమిషాల పాటు కొనసాగిన ఈ పాదయాత్రకు కాంగ్రెస్ కార్యకర్తలు, యువత భారీగా తరలివచ్చారు. దారిపొడవునా స్థానిక మహిళలు, నేత కార్మికులు సీఎంకు మంగళహారతులు, బోనాలతో ఘన స్వాగతం పలికారు. ఎత్తయిన భవనాలు ఎక్కి ముఖ్యమంత్రి వైపు చేతులు ఊపుతూ సంబరపడ్డారు. ర్యాలీలో యువకులు అధిక సంఖ్యలో పాల్గొని సీఎంతో ఫొటోలు దిగడానికి పోటీపడ్డారు. కాంగ్రెస్ శ్రేణుల నినాదాలతో సిరిసిల్ల వీధులు మార్మోగాయి. రేవంత్‌రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. దారిలో కొంతమంది మహిళలు వినతిపత్రాలతో నిలబడగా సీఎం వారి వద్దకు వెళ్లి తీసుకున్నారు.

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాదయాత్రలో ఆద్యంతం ఉత్సాహంగా కనిపించారు. డ్యాన్స్ చేస్తూ యువతను ఉత్సాహపరుస్తూ ముందుకు సాగారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తదితరులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు పాదయాత్రలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా రూ.345.78 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సీఎం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పెద్దూరులో రూ.5 కోట్లతో నిర్మించిన ఇందిరా మహిళా శక్తి భవనాన్ని ప్రారంభించారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవో కార్యాలయాలు, తంగళ్లపల్లి, వీర్నపల్లి, రుద్రంగి, వేములవాడ మండలాల రెవెన్యూ కార్యాలయాల నిర్మాణానికి రూ.15.25 కోట్లతో శ్రీకారం చుట్టారు. సిరిసిల్ల పట్టణం, కోనరావుపేట మండల కేంద్రంలో రూ.16.13 కోట్లతో నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు, సిరిసిల్ల నేతన్న బజార్‌కు శంకుస్థాపన చేశారు.

సిరిసిల్లలో రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల, రాజన్న ఆలయంలో ఫేజ్-1లో రూ.99.4 కోట్లతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు కూడా శ్రీకారం చుట్టారు. రుద్రంగిలో 10 వేల టన్నుల సామర్థ్యంతో రూ.10 కోట్లతో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ నిర్మించనున్న గోదాం, సిరిసిల్లలో చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో నేత బజారు పనులు, వేములవాడలో మహిళా పోలీస్ స్టేషన్, వేములవాడ, సిరిసిల్లలో రెండు ట్రాఫిక్ ఠాణాలకు శంకుస్థాపన చేశారు.

Tags: