Minister Ponguleti: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన చేశారు. ధనిక రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పులపాలు చేసిందని, ఇప్పుడు ఎల్‌నినోతో మరింత ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన అన్నారు. ఈ పరిస్థితిలో తల తాకట్టు పెట్టే దశ వచ్చినా సరే గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు, హైదరాబాద్‌లో టవర్స్ నిర్మాణంలో వెనకడుగు వేయబోమని స్పష్టం చేశారు.

విడతల వారీగా ప్రతి పేదకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని భరోసా ఇచ్చారు. క్యూర్ పరిధి మహేశ్వరం నియోజకవర్గంలోని జల్‌పల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మైలార్‌దేవ్‌పల్లిలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి గురువారం భూమిపూజ చేశారు. ముందుగా మహేశ్వరం ఎమ్మెల్యే సబితతో కలిసి జల్‌పల్లిలో, తర్వాత మైలార్‌దేవ్‌పల్లిలో శంకుస్థాపన చేశారు.

ఈ టవర్స్ నిర్మాణం పూర్తి చేసుకొని వచ్చే దీపావళి ఘనంగా చేసుకుందామని పొంగులేటి అన్నారు. ఆనాటి ప్రభుత్వం గులాబీ చొక్కా వేసుకుంటేనే లబ్ధి చేకూర్చిందని, నేటి ప్రజా ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపకుండా పేదవారికి పట్టం కడుతోందని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు గ్రామీణ ప్రాంతంలో 2 సార్లు ఇచ్చామని, ఇంకా 2 సార్లు ఇస్తామని, పట్టణ ప్రాంతంలో ఒకసారి ఇచ్చామని, ఇంకా 3 సార్లు ఇస్తామని పేర్కొన్నారు.

జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఈ భూమికి పక్కనే విమానాశ్రయం ఉందని, ఈ భూమిని వేలం వేస్తే ఎకరానికి రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్లు వస్తాయని చెప్పారు. ఒక్కో ఫ్లాటు విలువ కనీసం రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షలు ఉంటుందని, 6 గ్యారంటీల్లో ఇచ్చిన ప్రధాన హామీలు నెరవేర్చి ముందుకు వస్తామని అన్నారు.

హౌసింగ్‌బోర్డు ఎండీ గౌతమ్ లబ్ధిదారులకు ఇచ్చిన మాట తప్పకుండా ఉండాలని ఈసారి టవర్స్‌ను రెరాలో రిజిస్టర్ చేశామని, ఆ నిబంధనల మేరకు ఏడాదిలో నిర్మాణాలు పూర్తి చేయాల్సిందేనని చెప్పారు. రూ.6 లక్షలు చెల్లించడం తలకు మించిన భారమని కొందరు లబ్ధిదారులు తెలపగా, కష్టం కాకుండా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం ఈ-లాటరీ తీసి లబ్ధిదారులకు ఫ్లాటు కేటాయించి ధ్రువపత్రాలు అందజేశారు.

కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు చిగురింత పారిజాత తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం పేదలకు ఇళ్లు ఇవ్వడంలో ఎలాంటి రాజకీయ వివక్ష లేకుండా కొనసాగుతుందని మంత్రి పునరుద్ఘాటించారు.

Tags: