Minister Ponguleti : ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ సమస్యలపై మంత్రి పొంగులేటి కఠిన వైఖరి.. ఆకస్మిక తనిఖీలు చేస్తా
ఆకస్మిక తనిఖీలు చేస్తా
Minister Ponguleti : ఇందిరమ్మ ఇళ్ల పథకం, రెవెన్యూ సమస్యలు, భూ రీసర్వే వంటి అంశాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. నిరుపేదలకు ఇళ్లు అందించడంలో ఎలాంటి రాజకీయం ఉండదని స్పష్టం చేస్తూ, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తామని ప్రకటించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, అవినీతి, విధుల్లో అలసత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.
నిజామాబాద్‌లో పర్యటించిన మంత్రి పొంగులేటి నగరంలో హౌసింగ్ టవర్ నిర్మాణ పనులను పరిశీలించారు. పాముల బస్తీలో ఇందిరమ్మ ఇళ్లను సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడారు. గృహ ప్రవేశం చేసిన మహిళలకు నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. నిర్మాణ దశలో ఉన్న ఇళ్ల పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ విడతల వారీగా ఇళ్లు మంజూరు చేస్తామని, కొత్త టెక్నాలజీతో ఇందిరమ్మ మోడల్ టవర్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఓట్లు అడిగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ, హౌసింగ్ శాఖల అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ సమస్యలు, భూముల రీసర్వే, 22-ఎ కేసులు, భూభారతి దరఖాస్తులు, ఎసైన్డ్ భూముల సమస్యలపై చర్చించారు. తీసుకున్న నిర్ణయాలు, ఇచ్చిన ఆదేశాలను వెంటనే అమలు చేయాలని ఆదేశించారు.
విధుల్లో నిర్లక్ష్యం వహించిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట తహసీల్దార్‌ను సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సర్వే చేసేందుకు రూ.లక్ష డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు చేసిన ఘటనపై సంబంధిత తహసీల్దార్‌కు ఛార్జి మెమో జారీ చేయాలన్నారు. రీసర్వే, ఇందిరమ్మ ఇళ్లపై వేగం, భూ రీసర్వే పనులను పెండింగ్‌లో పెట్టే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి 15 రోజులకోసారి లైసెన్స్‌డ్ సర్వేయర్లకు ఎకరాకు రూ.60 చొప్పున చెల్లించాలని, ఇందిరమ్మ ఇళ్ల మొదటి దశలోని ఎల్-3 సమస్యలను ఈ నెలాఖరులోగా పరిష్కరించాలని, రెండో దశ ఇళ్ల మంజూరుకు ముందు లబ్ధిదారుల అర్హతను రెండుసార్లు పరిశీలించాలని ఆదేశించారు. 22-ఎ, ఎసైన్డ్ భూముల కేసులను పారదర్శకంగా, వేగంగా పరిష్కరించాలన్నారు.
మీడియాతో మాట్లాడుతూ మంత్రి పొంగులేటి.. భూ భారతిని తీసుకువచ్చి చిన్న పొరపాట్లు లేకుండా పాలన అందిస్తున్నామని, ఏడు లక్షల ఇందిరమ్మ ఇళ్లకు రూ.5 లక్షల చొప్పున ఇచ్చామని, హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు అందించామని, వివాద రహిత భూములను అందించడమే లక్ష్యమని తెలిపారు. సమీక్షలో హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్, సీసీఎల్‌ఏ కమిషనర్ లోకేశ్‌కుమార్, స్టాంపుల రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌గాంధీ హనుమంతు, నాలుగు జిల్లాల కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.