CM Revanth Reddy: మాదాపూర్‌లో హైడ్రా ద్వారా పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువును బుధవారం ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. 13 ఎకరాలకు కుంచించుకుపోయిన ఈ చెరువును 30 ఎకరాలకు విస్తరించి, జీవ, నిర్మాణ వ్యర్థాలు, చెత్త, మురుగునీటిని తొలగించి ఐటీ కారిడార్‌లో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు.


సీఎం మాట్లాడుతూ, ‘‘హైటెక్ సిటీ అంటే సైబర్ టవర్స్, అద్దాల మేడలు గుర్తొచ్చేవి. ఇప్పుడు తమ్మిడికుంట పేరు వినిపిస్తోంది. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ తమ్మిడికుంట అంటూ ఇక్కడి నుంచి పనిచేయడానికి ఇష్టపడతారు. అన్ని చెరువులను ఇలాగే తీర్చి దిద్ది ప్రజలు ‘వర్క్ ఫ్రమ్ లేక్స్’ అనేలా చర్యలు తీసుకోవాలి’’ అని సూచించారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు త్వరలో ప్రారంభమవుతుందని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా పూర్తి చేస్తామని ప్రకటించారు.


సినీ నటుడు అక్కినేని నాగార్జున తమ్మిడికుంటలో తన రెండెకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చినందుకు సీఎం సన్మానించారు. నాగార్జున నిజ జీవితంలోనూ హీరోలా వ్యవహరించారని కొనియాడారు. నాగార్జున మాట్లాడుతూ నగరాభివృద్ధి కోసం భూమి ఇవ్వడం సంతోషకరమని, మూసీ ప్రాజెక్టుకు మద్దతు తెలిపారు.


హైడ్రా చర్యలు కొందరికి కష్టమైనా నగరానికి ప్రయోజనం కలుగుతోందని సీఎం పేర్కొన్నారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, పిల్లల ఆటస్థలం ఏర్పాటు చేశారు. పండగలకు చెరువులు వేదికగా మారాలని, మహిళా సంఘాలకు దుకాణాల అవకాశం కల్పించాలని సూచించారు.

Tags: