Trending News

Dr. Nori Dattatreya: క్యాన్సర్‌పై పోరాటానికి ‘పద్మభూషణ్‌’ మరింత స్ఫూర్తి: డా. నోరి దత్తాత్రేయ

డా. నోరి దత్తాత్రేయ

Update: 2026-01-27 07:15 GMT

Dr. Nori Dattatreya: ప్రముఖ క్యాన్సర్ పరిశోధకుడు డా. నోరి దత్తాత్రేయుడు భారత ప్రభుత్వం తనకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ అవార్డు తనకు కేవలం గౌరవం మాత్రమే కాకుండా, క్యాన్సర్ మహమ్మారిపై పోరాటాన్ని మరింత బలోపేతం చేసే స్ఫూర్తిని, ఛాలెంజ్‌ను కూడా అందించిందని ఆయన అన్నారు.

సోమవారం బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి & రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (బీఐఏసీహెచ్ అండ్ ఆర్‌ఐ)లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ‘‘అమెరికాలోనూ, ప్రపంచవ్యాప్తంగా కూడా నాకు అనేక అవార్డులు వచ్చాయి. కానీ నా సేవలు, ఆవిష్కరణలు, పరిశోధనలకు గుర్తింపుగా స్వదేశంలోనే పద్మభూషణ్ లభించడం అపార సంతృప్తినిచ్చింది’’ అని తెలిపారు.

ఈ పురస్కారం తన రోడ్‌మ్యాప్‌ను మరింత బలంగా అమలు చేయడానికి ప్రేరణగా నిలుస్తుందని డా. నోరి దత్తాత్రేయుడు చెప్పారు. ‘‘రెండు తెలుగు రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా క్యాన్సర్‌పై పోరాటాన్ని తీవ్రతరం చేయాలనే నా సంకల్పానికి ఇది బలమైన బలం. కొన్ని రకాల క్యాన్సర్లను పూర్తిగా నివారించే అవకాశం ఉంది. రాబోయే ఆరేడేళ్లలో వాటిని తుడిచిపెట్టాలనే లక్ష్యంతో ముందుకు సాగుతా. మరికొన్ని రకాల క్యాన్సర్లను సరైన అవగాహనతో నియంత్రించవచ్చు. ఈ దిశగా నిరంతరం కృషి చేస్తా’’ అని ఆయన పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తన రోడ్‌మ్యాప్‌ను ఆమోదించినందుకు, కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ డా. నోరి దత్తాత్రేయుడిని గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో ట్రస్టు బోర్డు సభ్యుడు జేఎస్‌ఆర్ ప్రసాద్, సీఈవో డా. కె. కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

కృత్రిమ స్వరపేటికతో జాతీయ గీతం గానం – ప్రపంచ రికార్డు

అదే కార్యక్రమంలో మరో విశేషం జరిగింది. క్యాన్సర్ చికిత్సలో భాగంగా కృత్రిమ స్వరపేటికలు (artificial voice boxes) అమర్చుకున్న 75 మందికి పైగా రోగులు గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ గీతాన్ని సామూహికంగా పాడారు. లండన్‌కు చెందిన ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ సంస్థ దీనిని ప్రపంచ రికార్డుగా గుర్తించి సర్టిఫికెట్ అందజేసింది.

Tags:    

Similar News